నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నిడమనూరు మండలం ముప్పారం శివారులో బుధవారం సాయంత్రం భారీ గండి పడింది. దీంతో సుమారు ఐదువేల ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. వెంటనే అధికారులు కాలువకు నీటిని నిలిపేశారు. వేంపాడు స్టేజీ సమీపంలోని యూటీ వద్ద చిన్న సైజులో గండి పడినప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే భారీ గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. గండి వల్ల సమీపంలో ఉన్న నరసింహుల గూడెంలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. సుమారు 150 మందిని వేరే చోటుకు తరలించారు. నిడమనూరు సమీపంలోని గురుకుల పాఠశాల విద్యార్థులను ఫంక్షన్ హాల్‌కు తరలించారు.
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రధాన ఎడమ కాల్వకు నిడమనూరు మండలం ముప్పారం శివారులోని వేంపాడు స్టేజీ సమీపంలోని యూటీ వద్ద బుధవారం సాయంత్రం భారీ గండి పడింది. దీంతో ఎడమ కాల్వ కింద సాగులో ఉన్న సుమారు 5వేల ఎకరాల్లో వరి పొలాలు నీట ముని గాయి. పంట పొలాల్లో భారీగా ఇసుక మేట వేసింది. పొలాలపై నుంచి కాల్వ నీల్లు పెద్ద ఎత్తున వృధాగా పోతున్నాయి. వేంపాడు స్టేజీ సమీపంలోని యూటీ వద్ద చిన్న సైజులో గండి పడినప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రధాన కాల్వకు భారీగా గండిపడిందని, దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పులు చేసి మరీ సాగు చేసిన పొలాలు కండ్ల ముందే కొట్టుకుపోవడంతో అన్నదాతలు కంటతడిపెట్టారు. గండి పడిన ప్రాంతాన్ని నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. గండి వల్ల సమీపంలో ఉన్న నరసింహుల గూడెం గ్రామంలో కి ఎడమ కాల్వ నీరు భారీగా వచ్చి చేరింది. ఊరంతా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో పోలీసులు గ్రామాల్లోకి వెళ్లి సుమారు 150 మంది గ్రామస్తులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
గండిపడిన సాగర్ ఎడమ కాల్వకు సమీపంలోనే మినీ గురుకుల పాఠశాల ఉంది. అందులో సుమారు 87 మంది విద్యార్థులు ఉన్నారు. సకాలంలో అధికారులు హాస్టల్‌కు చేరుకుని, వార్డెన్ జ్యోతిని అలర్ట్ చేశారు. వెంటనే ఆమె హాస్టల్ విద్యార్థులను అప్రమత్తం చేసింది. 5 నిమిష్లాలోనే 87 మంది విద్యార్థులను అక్కడి నుంచి సేఫ్ ఏరియాకు తరలించారు.
ఎడమ కాల్వకు నీటి విడుదల నిలిపివేత
నిడమనూరు మండలం వేంపాడు సమీపంలోని సాగర్ ఎడమ ప్రధాన కాల్వకు వద్ద గండి పడడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇరిగేషన్ (ఎన్ఎస్పీ) అధికారులు హుటాహుటిన ఎడమ కాల్వకు నీటి విడుదల నిలిపివేశారు. గండి పడిన ఘటనపై ఎన్ఎస్పీ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.