అడుగంటిన నాగార్జున సాగర్

  •     590 నుంచి 504 అడుగులకు పడిపోయిన నీటి మట్టం
  •     వానల జాడలేక 22 లక్షల ఎకరాల ఆయకట్టుపై నీలినీడలు
  •     నార్లు పోసుకునేందుకు రైతులు ఎన్కాముందు

నల్గొండ, వెలుగు : నాగార్జునసాగర్​ రిజర్వాయర్​లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎన్నడూ లేనంతగా  రిజర్వాయర్​లో అట్టడుగున ఉండే రాళ్లు, రప్పలు బయటకు తేలాయి. సాగర్​ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 504 అడుగులకు పడిపోయింది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు కాగా.. కనిష్ట నిల్వ 213 టీఎంసీలు. వానలు లేకపోవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి కూడా చుక్కనీరు రాకపోవడంతో రిజర్వాయర్ ​నీరు మండుటెండలకు ఆవిరవుతోంది. బుధవారం నాటి లెక్కల ప్రకారం..

సాగర్​ రిజర్వాయర్​లో 504.20 అడుగుల మేర 112.033 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజుల్లో 528.30 అడుగులతో 16 4 టీఎంసీల నీరు ఉంది. గతేడాదితో పోలిస్తే సాగర్​లో 35 టీఎంసీల నీటి లభ్యత తక్కువగా ఉంది. డెడ్​స్టోరేజీ 510 అడుగులు కాగా, అంతకంటే  ఆరు అడుగుల దిగువకు నీటి మట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో రిజర్వాయర్​ పరిధిలోని కుడి, ఎడమ కాల్వల కింద ఆయకట్టుపై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 22 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారడంతో నార్లు పోసుకునేందుకు రైతులు ఎన్కాముందు అయితున్నారు.  

తాగునీటి అవసరాలకే.. 

రిజర్వాయర్​లో ఇప్పుడున్న నీళ్లు వచ్చే రెండు నెలల అవసరాలకే సరిపోతాయి. 490 అడుగుల వరకు మోటార్ల సాయంతో తాగునీటి అవసరాలకు నీళ్లు తోడుకోవచ్చు. వానలు పడి, పైనుంచి వరదలు వస్తే తప్ప సాగర్​లోకి నీటి ప్రవాహాలు వచ్చే పరిస్థితి లేదు. సాగర్​నీటి నిల్వలు పడిపోవడంతో ఆయకట్టు ప్రాంతంలోని రైతులు విపరీతంగా బోర్లు వేశారు. ఇవే పరిస్థితులు కొనసాగితే గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

22 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకరం

ఈ ప్రాజెక్టు కింద తెలంగాణ, ఏపీలో కలిపి ఐదు జిల్లాల్లో సుమారు 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనే 7, 19,739 ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మొత్తం 15.16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 

జంటనగరాలకు వాటర్​ సప్లై

సాగర్ నుంచి హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరా నిరంతరంగా కొనసాగుతోంది. రిజర్వాయర్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌ నుంచి పుట్టంగండి వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రెండు మోటార్లతో 800 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్​కు పంపింగ్ చేస్తున్నా రు. ఇక్కడి నుంచి జంట నగరాలకు 550 క్యూసెక్కులు, ఉమ్మడి నల్గొండలోని 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు.