నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని..వారం రోజుల్లో పూడుస్తామని SE ధర్మనాయక్ అన్నారు . మరో రెండు మూడు గంటల్లో నీటి ప్రవాహం ఆగిపోతుందని..ఆతర్వాత పనులు మొదలు పెడతామన్నారు. కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని డ్యాం సీఈ శ్రీకాంత్ రావు, SE ధర్మనాయక్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు .
ఎడమకాలువకు గండితో.. ముప్పారం, నర్సింహుల గూడెం, నిడమనూరు, శాకాపురం, పార్వతిపురం, రాజన్నగూడెం గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. 169వ జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రామాల్లోని ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం దగ్గర నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి పడింది. దీంతో లక్ష్మిదేవిగూడెం, నిడమనూరు, నర్సింహులు గూడెం గ్రామాల్లోకి నీళ్లు చేరాయి. నిడమనూరులో ఐదు అడుగుల మేర రోడ్డుపైకి నీళ్లు వచ్చాయి. దాదాపు ఐదు వేల ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. పంట పొలాల్లో భారీగా ఇసుక మేట వేసింది. వెంటనే లెఫ్ట్ కెనల్ వాటర్ ని నిలిపివేశారు అధికారులు. వచ్చే వరదను హాలియా దగ్గర డైవర్ట్ చేశారు. నర్సింహులగూడెంలో దాదాపు 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిడమనూరు సమీపంలోని గురుకుల పాఠశాల విద్యార్థులను స్థానిక ఫంక్షన్ హాల్ కు తరలించారు. వరద ఉధృతితో మిర్యాలగూడ - దేవరకొండ రహదారిపై రాక పోకలకు నిలిపివేశారు. నిడమనూరు దగ్గర హైవే భారీగా కోతకు గురైంది.
ముంపు గ్రామాల్లో ఎక్కడ చూసిన వరదతో వచ్చిన బురదే కనిపిస్తోంది. ఇళ్లల్లోని సామాన్లన్నీ తడిసిపోయాయి. బియ్యం బస్తాలన్నీ తడిసిపోవడంతో.. తినేందుకు ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిడమనూరు మినీ గురుకులంలోకి నడుముల్లోతు నీళ్లు వచ్చాయి. దీంతో.. స్కూల్, హాస్టల్ లో విద్యార్థుల పుస్తకాలు, బట్టలు, ట్రంకు పెట్టెలు అన్నీ నీటిలో మునిగిపోయాయి. వరద నీరు తగ్గిన తర్వాత.. స్కూల్, హాస్టల్ లో ఎటు చూసినా.. బురదే కనిపిస్తోంది. విద్యార్థుల బుక్స్, బ్యాగులు బురదతో కనిపిస్తున్నాయి. పొలాల్లో ఇప్పటికీ వరద నీరు భారీగా కనిపిస్తోంది. మోకాళ్లలోతు నీళ్లలో పలుచోట్ల గ్రామస్తులు చేపలు పడుతున్నారు.