ఇవాళ నాంపల్లి కోర్టుకు నాగార్జున..

ఇవాళ నాంపల్లి కోర్టుకు నాగార్జున..
  • కొండా సురేఖపై పరువునష్టం కేసులో స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ రికార్డ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన క్రిమినల్‌‌‌‌‌‌‌‌, పరువునష్టం దావా కేసును నాంపల్లి మనోరంజన్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లోని స్పెషల్‌‌‌‌‌‌‌‌ కోర్టు విచారణకు స్వీకరించింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై సోమవారం విచారణ జరిపింది. పిటిషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న అంశాలను నాగార్జున తరఫు అడ్వొకేట్ కోర్టుకు వివరించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను అందించారు.

 ఫిర్యాదుదారు నాగార్జున, పిటిషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్న సాక్షులు యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాంగ్మూలాలను రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేయాలని కోరారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని వాదనలు వినిపించారు. ఈ మేరకు నాగార్జున సహా ముగ్గురి స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ను రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు కోర్టు అంగీకరించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నాగార్జున వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై జడ్జి సమక్షంలో తన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. ఆపై కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.