బౌద్ధ మత చరిత్రకు కేరాఫ్‌‌‌‌ నాగార్జున కొండ

‘‘బుద్ధం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్చామి.. సంఘం శరణం గచ్చామి” అంటూ ధర్మబోధ చేసిన బౌద్ధ మత చరిత్రకు కేరాఫ్‌‌‌‌ నాగార్జున కొండ. ఇది ఆచార్య నాగార్జునుడు నడిచిన నేల. అందుకే ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్ట్‌‌‌‌లు, బౌద్ధ మతస్తులు వస్తుంటారు. ఒకప్పటి పెద్ద పట్టణం.. ఇప్పుడు ఒక ఐల్యాండ్‌‌‌‌లా మిగిలింది. కొండపైన ఉన్న మ్యూజియంలో ఒకప్పటి బౌద్ధ అవశేషాలు, బుద్ధుని దంత ధాతువు, శిలా శాసనాలు ఎన్నో ఉన్నాయి.

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సరిహద్దులో ఉన్న నాగార్జున సాగర్​ ప్రాజెక్ట్​ నడిమధ్యలో ఉన్న దీవి నాగార్జున కొండ. ఇది ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం పరిధిలో ఉంది. ఇక్కడికి రెండు రాష్ట్రాల నుంచి బోట్​ ద్వారా చేరుకోవచ్చు. ఈ కొండపైనే శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడి కోసం మహా చైత్య విహారాలను కట్టించాడని పుస్తకాలు చెప్తున్నాయి. అందుకే దాన్ని ఇప్పుడు నాగార్జున కొండ అని పిలుస్తున్నారు. ఇక్కడ పురావస్తు శాఖ ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది. ఇది ప్రపంచంలో రెండో ద్వీపపు మ్యూజియం. అంతేకాదు.. ప్రపంచంలోని పురావస్తు ద్వీప ప్రదర్శన శాలల్లో ఇదే అతిపెద్దది. ఇక్కడ బౌద్ధ చరిత్రను తెలియజేసే శిలా శాసనాలు, పాలరాతి స్థూపాలు, పురాతన కట్టడాలు, విహారాలు, మహా చైత్యం, స్నానపు ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ఆచార్యుని జీవిత విశేషాలను ముందు తరాలకు తెలిసేలా ఆయనకు సంబంధించిన అన్ని ఆధారాలు ఈ మ్యూజియంలో ఉంచారు.
144 ఎకరాల విస్తీర్ణంలో...
నాగార్జునసాగర్‌‌‌‌ ప్రాజెక్టుకు ఎగువన 14 కిలోమీటర్ల దూరంలో.. రిజర్వాయర్ మధ్యలో.. నల్లమల కొండల నడుమ.. 144 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతమే నాగార్జున కొండ. ఈ కొండపై 1966లో మ్యూజియం ఏర్పాటు చేశారు. చుట్టూ నీళ్లు ఉండడంతో దీన్ని ‘‘ఐల్యాండ్‌‌‌‌ మ్యూజియం” అని కూడా పిలుస్తారు. 
నాగార్జునుడే నిర్మించాడు 


నాగార్జున సాగర్‌‌ ప్రాంతంలో కేంద్ర పురావస్తు శాఖ 3,700 చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో  తవ్వకాలు జరిపింది. అప్పుడే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి. నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌కు దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఈ శిథిలాలు దొరికాయి. ఈ యూనివర్సిటీని ఇక్ష్వాకుల కాలంలో ఏర్పాటు చేశారు. సాగర్‌‌కు దగ్గరలో ఉన్న అనుపు గ్రామంలో యూనివర్సిటీ నమూనాను నిర్మించారు. అక్కడే యాంఫీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి ఆలయం కూడా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జపాన్, చైనా, శ్రీలంక, మలేసియా, టిబెట్, భూటాన్, థాయ్‌‌‌‌లాండ్, బర్మా వంటి దేశాల నుంచి కూడా బౌద్ధ ఆరాధకులు ప్రతి ఏటా నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలకు వస్తుంటారు. 
ఐదు అంతస్థుల్లో.. 
ఆచార్య నాగార్జున యూనివర్సిటీని నాగార్జునుడే నిర్మించాడు. ఇది ఐదు అంతస్తుల్లో ఉందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో దీన్ని పర్వత విహారమని కూడా పిలిచేవాళ్లు. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ ఉండేది. అందులోని శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అప్పట్లో చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌‌‌‌ నుంచి స్టూడెంట్స్‌‌‌‌ ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్లు. రసాయన, వృక్ష, ఖనిజ, వైద్య విద్య కోర్సులు ఇక్కడ ఉండేవి. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు ‘అపరామృతం’ కనుగొన్నట్టు ఆధారాలున్నాయి. చరిత్రకారులు పాహియాన్, హ్యుయాన్‌‌‌‌త్సాంగ్, ఇత్సింగ్‌‌‌‌ఈ విద్యాలయానికి వచ్చి, కొంతకాలం ఇక్కడే ఉండి మహాయాన బౌద్ధమతం గురించి స్టడీ చేశారని చరిత్ర చెప్తోంది. నాగార్జునుడు చనిపోయాక కూడా కొన్ని వందల ఏండ్లు యూనివర్సిటీ ఉన్నట్టు ఆధారాలున్నాయి. 

టూరిస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌గా.. 
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌‌‌‌ ప్రాంతంలోని టూరిస్ట్ ప్లేసుల జాబితాలో మరో ప్లేస్‌ చేరనుంది. సాగర్‌‌‌‌సిగలో.. కృష్ణా ఒడిలో మరో అద్భుతమైన టూరిస్ట్‌‌‌‌ స్పాట్‌‌‌‌ ఏర్పాటు కాబోతుంది. నాగార్జున సాగర్‌‌‌‌ హిల్‌‌‌‌ కాలనీ డౌన్‌‌‌‌ పార్కు దగ్గర, తెలంగాణ లాంచీ స్టేషన్‌‌‌‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీప ప్రాంతం చాకలిగట్టు. ఇది దాదాపు 407 ఎకరాల్లో ఉంది. దీన్ని టూరిస్ట్ స్పాట్‌‌‌‌గా డెవలప్‌‌‌‌ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్‌‌‌‌ ఆలోచిస్తోంది. సాగర్‌‌‌‌ నుంచి బోటులో నాగార్జునకొండకు వెళ్లేదారిలో ఉంది ఇది. మధ్య, కొత్త రాతి యుగాల్లో ఇక్కడ ఆదిమానవులు నివసించినట్లు ఆధారాలు దొరికాయి. కొంతకాలంగా ఇది టూరిస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌గా డెవలప్‌‌‌‌ అవుతోంది. ఇది తెలంగాణ పరిధిలో ఉండడంతో పాటు నాగార్జున కొండకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాకలిగట్టు దగ్గర రోప్‌‌‌‌వేలు, బోటింగ్‌‌‌‌, ట్రెక్కింగ్‌‌‌‌ లాంటివి ఏర్పాటు చేస్తే ఇంటర్నేషనల్‌‌‌‌ టూరిస్టులు వస్తారని పర్యాటక శాఖ ఆలోచన.  ::: వద్దిరెడ్డి వెంకట్ రెడ్డి, హాలియా, వెలుగు 

 

ఇవి కూడా చదవండి

ఈ ఊళ్లో ఇండ్లన్నీ ఒకేలా ఉంటాయి

జై భీమ్​ కోసం అడవిలో తిరిగా

స్ట్రాటజీ పాలిటిక్స్!