సాగర్ ప్రధాన ఎడమ కాల్వకు బుంగ

  •     నడిగూడెం మండలం రామాపురం శివారులో గుర్తింపు 
  •      బోర్డు పెట్టి వెళ్లిపోయిన ఆఫీసర్లు  

నడిగూడెం (మునగాల), వెలుగు : నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాల్వకు నడిగూడెం మండలం రామాపురం శివారులోని 120 కిలోమీటర్ల సమీపంలో బుంగ పడింది. రెండు రోజుల క్రితం తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్​కు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ప్రధాన ఎడమ కాల్వ నుంచి 5500 క్యూసెక్కుల  విడుదల చేస్తుండగా మునగాల హెడ్ రెగ్యులేటర్ వద్దకు వచ్చేసరికి 3500 క్యూసెక్కులు పాలేరు రిజర్వాయర్​కు  పోతున్నాయి. ఈ క్రమంలో నీటి ప్రవాహ ఉధృతికి కాల్వకు120 కిలోమీటర్ల వద్ద కట్ట కోతకు గురై బుంగ పడింది.

మునగాల తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేశ్ దీన్ దయాల్, నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ , ఎన్ఎస్పీ సిబ్బంది అక్కడికి చేరుకొని బుంగ పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. టెంపరరీగా కంపవేసి రాకపోకలను నిషేధిస్తున్నట్టు బోర్డు పెట్టి వెళ్లిపోయారు. దీంతో నీటి ఉధృతికి మరింత కోతకు గురై ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఈ ప్రదేశంలోనే కాల్వ కట్ట కోతకు గురైందని, రిపేర్లు చేయించాలని స్థానికులు ఆఫీసర్లను కోరినా వారు పట్టించుకోలేదన్నారు.