మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
  • సాగర్​ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి 

హాలియా, వెలుగు : మహిళల ఆర్థిక బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం హాలియాలోని లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్​) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మహిళలే కీలకమన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్​అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని గుర్తుచేశారు. 

కాంగ్రెస్ ఇచ్చినమాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి స్ఫూర్తితో తన సొంత నిధులు రూ.1.25 లక్షలతో దుప్పట్లు, ట్రై సైకిళ్లు, డిస్క్ బెంచ్ లను పంపిణీ చేసినట్లు తెలిపారు. నెల్లికలు లిఫ్ట్​ను త్వరలోనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ చైర్మన్లు చంద్రశేఖర్ రెడ్డి , సత్యం, నాయకులు ఎడవల్లి నరేందర్ రెడ్డి, కుందూరు వెంకటరెడ్డి, భగవాన్ నాయక్, కలసాని చంద్రశేఖర్, చింతల చంద్రారెడ్డి, తహసీల్దార్ రఘు, ఏపీఎం కళావతి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.