జానారెడ్డిపై ప్రజల్లో విశ్వాసం ఉన్నా కాంగ్రెస్ పార్టీపై లేదు 

వరంగల్: నాగార్జునసాగర్‌లో జానారెడ్డికి ప్రజల్లో విశ్వాసం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేదని.. టీఆర్ఎస్ గెలుపు వంద శాతం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్  తరువాత బీజేపీ చతికిల పడింది కాబట్టి టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ జరగబోతోందని ఆయన అన్నారు. మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై తనదైన శైలిలో విశ్లేషించారు. జానా రెడ్డిపై ప్రజల్లో విశ్వాసం ఉంది కానీ ,కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం లేదు కాబట్టి అక్కడ  టీఆరెస్ పార్టీ గెలుస్తోందన్నారు. గతంలో ఎన్నడూ ఏ పార్టీ కూడా అధికారంలో ఉండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువలేదు, మేము రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామన్నారు. మా ప్రభుత్వం రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది అంటే మా సత్తా ఏంటో చూడండి అని ఆయన వివరించారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందన్నారు. బీజేపీకి  రాష్ట్రంలో రోజురోజుకు గ్రాఫ్ పడిపోతుందని, బీజేపీ లీడర్లు టీఆర్ ఎస్ పార్టీ వైపు చూస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.