పల్లీకి రూ.10 వేల మద్దతు ధర చెల్లించాలి

పల్లీకి రూ.10 వేల మద్దతు ధర చెల్లించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వేరుశనగ పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రైతులు మంగళవారం రోడ్డెక్కారు. నాగర్​కర్నూల్​ వ్యవసాయ మార్కెట్  ఆఫీస్​ ముందు ధర్నా నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. రోజురోజుకు ధరను తగ్గిస్తూ వ్యాపారులు తమను ముంచుతున్నారని వాపోయారు. మార్కెట్​ సిబ్బంది, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా పల్లీలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

క్వింటాల్​కు కనీసం రూ.10 వేల మద్దతు ధర ఇవ్వాలని కోరారు. సీఐ కనకయ్య జోక్యం చేసుకొని రైతు సంఘం నాయకులు, రైతులు, మార్కెట్  కార్యదర్శి, వ్యాపారస్తులతో చర్చించి క్వింటాల్​కు రూ.వంద చొప్పున ధర పెంచడంతో సమస్య సద్దుమణిగింది. రైతులు పంటను అమ్మిన తర్వాత ట్రేడర్స్  ద్వారా ఒరిజినల్  బిల్లులు ఇప్పించాలని మార్కెట్  కార్యదర్శి రవికుమార్​కు సూచించారు. కమీషన్​ కింద రూ.5 వసూలు చేస్తున్నారని కార్యదర్శిని నిలదీయగా, రూల్స్​ ప్రకారం రూ.2 వసూలు కమీషన్  ఇవ్వాలని సూచించారు. ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు తమ దృష్టికి తీసుకురావాలని, వ్యాపారుల లైసెన్స్  రద్దు చేస్తామని మార్కెట్  కార్యదర్శి తెలిపారు. 

మహబూబ్​నగర్​లో..

పాలమూరు: మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో వేరుశనగ రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్  చౌరస్తాలో ధర్నా చేశారు. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. మార్కెట్  ఆఫీస్  ముందు బైఠాయించి మద్దతు ధర కల్పించాలని నినాదాలతో హోరెత్తించారు. వేరుశనగ పంటను కుప్పలుగా పోసి ఆందోళన చేశారు. క్వింటాల్​ వేరుశనగను రూ.7,500కు  కొనుగోలు చేయాలని డిమాండ్  చేశారు.