నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో వచ్చే వారికి భరోసా కల్పించేలా అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలపై తీసుకున్న చర్యలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.
వనపర్తి: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు, అర్జీలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేశ్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. వచ్చిన అర్జీలను పరిశీలించి, పరిష్కారం చూపేలా జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.