నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లా స్థాయి ఎన్నికల నోడల్ ఆఫీసర్లు విధులు పక్కాగా నిర్వహించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంచనాలు, మానిటరింగ్ కమిటీ, స్వీప్, పోస్టల్ బ్యాలెట్, మ్యాన్ పవర్, నోడల్, రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు.
నోడల్ ఆఫీసర్లు నిర్వహిస్తున్న విధులపై రివ్యూ చేశారు. అభ్యర్థుల వ్యయ నిర్వహణ రిజిస్టర్లు పక్కాగా ఉండేలా చూడాలన్నారు. నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెయిడ్ ఆర్టికల్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలు, సోషల్ మీడియాలో వచ్చే అభ్యంతరకర వీడియోలు, సందేశాలపై నిఘా పెట్టాలని సూచించారు.
అడిషనల్ కలెక్టర్లు కుమార్ దీపక్, సీతారామారావు, నోడల్ ఆఫీసర్లు నర్సింగ్ రావు, ఉష, పత్యా నాయక్, శ్రీనివాసులు, శ్రీనివాస్ బాబు, రమాదేవి, ఫయాజుద్దీన్, రిటర్నింగ్ ఆఫీసర్లు వెంకట్ రెడ్డి, గోపిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ కలెక్టరేట్: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా రిటర్నింగ్ ఆఫీసర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్ జి.రవినాయక్ ఆదేశించారు. రిటర్నింగ్ ఆఫీసర్లతో వివిధ అంశాలపై రివ్యూ నిర్వహించారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందజేయాల్సిన అఫిడవిట్లు తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ హర్షవర్ధన్, జడ్చర్ల రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్ .మోహన్ రావు, మహబూబ్ నగర్ రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ కుమార్, దేవరకద్ర రిటర్నింగ్ ఆఫీసర్ నటరాజ్ పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలి
గద్వాల: కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. గద్వాల మండలం గోన్పాడులోని పాలిటెక్నిక్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ సెంటర్ ను ఎస్పీ రితిరాజ్ తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకొని, ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, శ్రీనివాస్, తహసీల్దార్ నరేందర్ పాల్గొన్నారు.
మక్తల్: నామినేషన్లకు అన్నిఎర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేశ్‌గౌతం, అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్ సూచించారు. సోమవారం తహసీల్దార్ ఆఫీస్‌ను విజిట్ చేసి ఎలక్షన్ అఫీసర్లతో మాట్లాడారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ, తహసీల్దార్ సువర్ణరాజ్, ఎస్ఐ పర్వతాలు పాల్గొన్నారు.