నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ధరణి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నాగర్కర్నూల్ కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ధరణి కొత్త మార్గదర్శకాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటించి ధరణి సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 2,448 ధరణి సమస్యలపై దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు.
ఈ నెల 9 వరకు ప్రతి మండలంలో ధరణి సమస్యలపై తహసీల్దార్ ఆఫీసుల్లో ప్రజలు తమ భూ సమస్యలపై చేసిన కంప్లైంట్లపై రివ్యూ చేసుకోవాలన్నారు. భూ సంబంధిత ఫిర్యాదులు 2,323 ఉన్నాయని, వివిధ ఖాతాలను ఒకే ఖాతాగా చేయాలనే ఫిర్యాదులు 125 అందాయని చెప్పారు. ధరణి కొత్త మార్గదర్శకాలు, సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. తహసీల్దార్ స్థాయిలోనే ఎక్కువ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్ తో పాటు రెవెన్యూ సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు.
గ్రామ పంచాయతీల వారీగా ఫిర్యాదులను పరిశీలించాలని సూచించారు. సేత్వార్, కాస్ర, పహాని, వన్ బి, రిజిస్టర్లు ధరణిలో అందుబాటులో ఉన్న రికార్డులు, డాక్యుమెంట్లు, అసైన్డ్, ఇనాం, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల వివరాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులన్నీ పరిష్కరించాలని, పెండింగ్లో ఉంచవద్దని ఆదేశించారు.