ఊర్కొండపేట గ్యాంగ్‌‌రేప్‌‌ నిందితులు అరెస్ట్‌‌

ఊర్కొండపేట గ్యాంగ్‌‌రేప్‌‌ నిందితులు అరెస్ట్‌‌
  • ఏడుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌కు పంపిన పోలీసులు
  • ఆలయాలు, టూరిస్ట్‌‌ ప్లేస్‌‌లలో భద్రత పెంచుతాం : ఎస్పీ వైభవ్‌‌ గైక్వాడ్‌‌

నాగర్‌‌కర్నూల్‌‌, వెలుగు : నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో వివాహితపై గ్యాంగ్‌‌రేప్‌‌కు పాల్పడ్డ ఏడుగురిని అరెస్ట్‌‌ చేసినట్లు ఎస్పీ వైభవ్‌‌ గైక్వాడ్‌‌ తెలిపారు. బుధవారం కల్వకుర్తి డీఎస్పీ ఆఫీస్‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మిడ్జిల్‌‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ శనివారం సాయంత్రం తల్లిదండ్రులు, ఫ్యామిలీతో కలిసి ఊర్కొండపేట ఆలయానికి వచ్చింది.

తర్వాత తన బంధువు, బావ అయిన వ్యక్తికి ఫోన్‌‌ చేసి గుడి వద్దకు పిలిపించింది. ఈ క్రమంలో సదరు మహిళ రాత్రి10.30 గంటల టైంలో బహిర్భూమికి వెళ్లేందుకు తన బంధువును వెంట తీసుకొని ఆలయానికి 100 మీటర్ల దూరంలోకి వెళ్లింది. ఇద్దరు బయటకు వెళ్లడాన్ని గమనించిన నలుగురు వ్యక్తులు వీరిని వెంబడించి, ఇద్దరినీ భయపెట్టి మరింత దూరం తీసుకెళ్లారు. తర్వాత మరో ముగ్గురు వ్యక్తులకు ఫోన్‌‌ చేసి పిలిపించారు.

మద్యం మత్తులో ఉన్న ఏడుగురు నిందితులు మహిళతో వచ్చిన బంధువును కట్టేసి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు దాహం వేస్తుంది.. నీళ్లు ఇవ్వాలని అడిగితే నోట్లో యూరిన్‌‌ పోసి అమానవీయంగా ప్రవర్తించారు. దాడి విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి, మహిళ ఒంటిపై ఉన్న బంగారం, డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత బాధిత మహిళ తన బంధువు కట్లు విప్పేయడంతో ఇద్దరూ కలిసి తిరిగి గుడి వద్దకు వెళ్లిపోయారు.

తెల్లారిన తర్వాత మహిళతో ఉన్న వ్యక్తి భూత్పూర్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌కు వెళ్లి.. గుర్తుతెలియని వ్యక్తులు తనతో పాటు, మహిళపై దాడి చేసి బంగారం, డబ్బు గుంజుకున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అలర్ట్‌‌ అయిన పోలీసులు ఆలయ పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజీ, మొబైల్‌‌ డేటాను పరిశీలించి దాడికి పాల్పడింది మారపాకుల ఆంజనేయులు, సాదిఖ్‌‌ బాబా, వగులదాస్‌‌ మణికంఠ, కార్తీక్, మట్ట మహేశ్‌‌గౌడ్‌‌, హరీశ్‌‌గౌడ్‌‌, మట్ట ఆంజనేయులు గౌడ్‌‌గా గుర్తించారు.

వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. ఊర్కొండపేటలో గతంలోనూ కొన్ని ఘటనలు జరిగినట్లు విచారణలో తేలిందని, వాటిపై కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు. నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్‌‌ కోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. ఊర్కొండపేటతో పాటు మద్దిమడుగు, ఉమామహేశ్వరం, సిరుసనగండ్ల, సింగోటం వంటి ఆలయాలకు వచ్చే భక్తుల భద్రతకు పోలీస్‌‌ బందోబస్త్‌‌ పెంచుతామని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్దన్‌‌రెడ్డి, ఎస్సైలు కృష్ణదేవరాయ, మాధవరెడ్డి, కురుమూర్తిని ఎస్పీ అభినందించారు.