ప్రాజెక్టుల పర్యవేక్షణ ఎలా? నాగర్​కర్నూల్​ జిల్లాలో ఇరిగేషన్​ ఇంజనీర్ల షార్టేజ్

ప్రాజెక్టుల పర్యవేక్షణ ఎలా? నాగర్​కర్నూల్​ జిల్లాలో ఇరిగేషన్​ ఇంజనీర్ల షార్టేజ్
  • ఖాళీగా సీఈ పోస్ట్, ఎస్ఈకి అడిషనల్​ చార్జ్
  • ప్రాజెక్టుల పర్యవేక్షణపై ప్రభావం

నాగర్ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్​ జిల్లాలో నీటిపారుదల శాఖ ఇంజనీర్ల కొరత నెలకొంది. సీఈ, ఎస్ఈ, ఈఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల పర్యవేక్షణపై ప్రభావం పడుతోంది. ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ లో​ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లు లేకపోవడం జిల్లాకు శాపంగా మారింది. దీంతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలో 12లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్​ పర్యవేక్షణ, నిధుల వినియోగం గందరగోళంగా మారింది. 

ఖాళీలు లేదంటే అదనపు బాధ్యతలు..

ఇన్​చార్జి సీఈగా పని చేసిన సర్కిల్–1 ఎస్ఈ​మార్చిలో రిటైర్​ అయ్యారు. సర్కిల్–2​ ఎస్ఈ సత్యనారాయణ రెడ్డికి వనపర్తి ఇన్​చార్జి సీఈగా బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఆరు ఇరిగేషన్​ డివిజన్లు ఉండగా, అచ్చంపేట డివిజన్​ ఈఈ రిటైర్​ అయ్యి ఏడాది దాటినా ఇంత వరకు ఎవరినీ నియమించలేదు. కొల్లాపూర్​ డివిజన్​ ఈఈగా పని చేస్తున్న శ్రీనివాస్​రెడ్డికి పక్క జిల్లాలో ఇన్​చార్జి ఎస్ఈగా బాధ్యతలు అప్పగించారు. కొల్లాపూర్, నాగర్​కర్నూల్​ డివిజన్లలో పాలమూరు, -రంగారెడ్డి ప్రాజెక్ట్​ పనులు నడుస్తుండగా, కల్వకుర్తి డివిజన్​లో పనులు మొదలు కాలేదు.

 కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్యాకేజీ–29లో కాల్వలు,ఉప కాల్వలు, మైనర్లు, ఇతర నిర్మాణాలు జరుగుతున్నాయి. రెగ్యులర్​ ఇంజనీర్లకు అదనంగా కీలక బాధ్యతలు అప్పగించడంతో ప్రాజెక్టుల పురోగతి, నిధుల విడుదల, వ్యయం, క్వాలిటీ, పర్యవేక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.

ఇంజనీర్ల కొరత తీర్చితేనే..

ఇన్​చార్జి ఇంజనీరింగ్​ అధికారులతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు, -రంగారెడ్డి ప్రాజెక్ట్​తో పాటు కేఎల్ఐ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అంటున్నారు. జిల్లాలో ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీటిని అందిస్తామని సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రెగ్యులర్​ అధికారులు నియమించాలని చెబుతున్నారు. సీఈ, రెండు ఎస్ఈ, అచ్చంపేట డివిజన్  ఈఈ పోస్టును భర్తీ చేయాలని కోరుతున్నారు. కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో కింది స్థాయి అధికారులు సైతం పూర్తి స్థాయిలో పని చేయడం లేదనే విమర్శలున్నాయి.

పర్యవేక్షణే కీలకం..

నాగర్​ కర్నూల్​ జిల్లాలో ప్రాజెక్టుల పురోగతి, భూసేకరణ, ఆర్అండ్ఆర్, నిధుల వినియోగం, క్వాలిటీ కంట్రోల్​ తదితర అంశాల పర్యవేక్షణకు చీఫ్​ ఇంజనీర్, రెండు ఎస్ఈ సర్కిల్స్, ఆరు డివిజన్లు ఏర్పాటు చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులోని 21 ప్యాకేజీల్లో కీలకమైన 12 ప్యాకేజీలు నాగర్​కర్నూల్​ జిల్లాలోనే ఉన్నాయి.​ ఇందులో రిజర్వా యర్లు, పంప్ ​హౌజ్ లు, అండర్​టన్నెల్స్, ఓపెన్​ కెనాల్స్​ ఉన్నాయి. నార్లాపూర్​ సమీపంలో అంజనాద్రి రిజర్వాయర్, పంప్​హౌజ్, ఏదుల రిజర్వాయర్,​ పంప్​హౌజ్, వట్టెం పంప్​హౌజ్, రిజర్వా యర్​ వంటి వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు జరుగుతున్నాయి. రిజర్వాయర్లు, కెనాల్స్​లో ముంపునకు గురైన గ్రామాల పునరావాసం వంటి కీలకమైన అంశాలు ఉన్నాయి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 2023లో నార్లాపూర్​ పంప్​హౌజ్​లో ఒక్క పంపు బిగించేందుకే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు చెమటోడ్చారు.

 అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్​ పనులు నడుస్తూనే ఉన్నాయి. నార్లాపూర్,​ -ఏదుల రిజర్వాయర్ల మధ్య మెయిన్​ కెనాల్​ పెండింగ్​ పనులు, పంప్​హౌజ్​లో మోటార్ల బిగింపు, ఎలక్ట్రో మెకానికల్, సివిల్​ ఇంజనీరింగ్​ పనులు, ఒక టీఎంసీ నీటిని తరలించే అండర్​ టన్నెల్​ లైనింగ్, ఓపెన్​ కెనాల్​ పనులు మిగిలిపోయాయి. కల్వకుర్తి లిఫ్ట్​ స్కీంలో ఐదేండ్ల కింద ప్రమాదానికి గురైన ఎల్లూరు ఫస్ట్​ లిఫ్ట్​లో రెండు పంపులు ఇంకా వినియోగంలోకి తేలేదు. గుడిపల్లిగట్టులో ఒక పంపు సంగతి ఇంకా తేలలేదు. మిషన్​ భగీరథ స్కీంకు నార్లాపూర్  రిజర్వాయర్​ నుంచి ఏర్పాటు చేసిన లింక్​ కెనాల్,హెడ్​ రెగ్యులేటర్​ నిర్మాణం, తదితర కీలక పనులు నిలిచిపోయాయి.

బడ్డెట్​లో నిధులిచ్చినా..

ఈ సారి బడ్డెట్​లో పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. నిధుల వ్యయం, నిర్వహణ, పురోగతిపై సమీక్షలు ఎవరు నిర్వహిస్తారని అంటున్నారు. పెండింగ్​ బిల్లుల పంచాయితీ, డీపీఆర్​లోని పనుల్లో వేగం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇరిగేషన్​ శాఖలో కీలకమైన ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేసి ప్రాజెక్టు పనులను స్పీడప్​ చేయాలని కోరుతున్నారు.