- అమిత్‌షా సమక్షంలో నేడు పార్టీలోకి రాములు
- ఆయన వెంట మరో ముగ్గురు ముఖ్య నేతలు
- పార్లమెంట్ ఎన్ని కల ముందు బీఆర్ఎస్కు షాక్
నాగర్ కర్నూల్, వెలుగు: పార్లమెంట్ఎన్నికల ముందు బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కారు దిగి కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా నాగర్కర్నూల్ఎంపీ పోతుగంటి రాములు గురువారం బీజేపీలో చేరబోతున్నారు. ఆయన కొడుకు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డితో కలిసి గురువారం అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరేందుకు బుధవారం రాత్రే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన రాములు తనకు బీఆర్ఎస్లో కనీస గౌరవం లేకుండా పోయిందని కొంతకాలంగా సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుకు, ఎంపీ పోతుగంటి రాములుకు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఎంపీ కొడుకు భరత్ ప్రసాద్‌ను జడ్పీ చైర్మన్ కాకుండా గువ్వల రెండుసార్లు అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలో ఎంపీ, ఆయన కొడుకు ఫ్లెక్సీలను కూడా పెట్టకుండా అడ్డుకున్న గువ్వలపై హైకమాండ్ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రాములు కలత చెందినట్టు సమాచారం.
ఎన్నికల ముందు అచ్చంపేటలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభకు కూడా ఎంపీని ఆహ్వానించలేదు. దీనికితోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గువ్వల.. తానే ఎంపీ అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడం కూడా వీరి మధ్య గ్యాప్‌ను పెంచింది. మరోవైపు తన కొడుకు భరత్‌ప్రసాద్ రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు వనపర్తి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నారు.