అమ్రాబాద్, వెలుగు: కిలిమంజారో పర్వతం ఎక్కే సత్తా ఆ యువకుడికి ఉన్నా అక్కడికి వెళ్లే ఆర్థిక స్థోమత లేదు. దీంతో దాతల కోసం అతను ఎదురుచూస్తున్నాడు. నల్లమల ఏజెన్సీ ప్రాంతం నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన రామావత్ జయరాంకు చిన్నతనం నుంచి పర్వతారోహణపై ఆసక్తి ఎక్కువ. ట్రెక్కింగ్ లో శిక్షణ పొంది దక్షిణాఫ్రికాలోని 5,895 మీటర్ల ఎత్తున్న మౌంట్ కిలిమంజారో పర్వతారోహణకు వెళ్లడానికి అనుమతులతో సిద్ధంగా ఉన్నాడు. కానీ మారుమూల ప్రాంతానికి చెందిన తను నిరుపేద కావడంతో ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
డిగ్రీ ఫైనలియర్ చదువుతూ తనకున్న ఆసక్తితో పర్వతాన్ని అధిరోహించడానికి భువనగిరి యాదాద్రి జిల్లాలోని రాక్ క్లైంబింగ్ స్కూల్ లో శిక్షణ పొందాడు. 2023 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 16 మధ్య నార్త్ సిక్కింలోని 17,330 ఫీట్ల ఎత్తు కలిగిన ఏఎల్డీ 22 పర్వతాన్ని అతను అధిరోహించాడు. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి తనకు రూ.3.30 లక్షలు ఖర్చవుతుందని జయరాం తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం, దాతలు సాయం చేస్తే తెలంగాణ ఖ్యాతిని, జాతీయ పతాక గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు శ్రమిస్తానని పేర్కొన్నాడు. దాతలు 83094 17487 ఫోన్ పే, గూగుల్ పే ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ సాయం అందించాలని కోరుతున్నాడు.