భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు: తన హయాంలో దాదాపు రూ. 10వేల కోట్ల నిధులతో ఖమ్మం పార్లమెంట్పరిధిలో పలు అభివృద్ధి పనులు చేశామని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి, పార్టీ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కొత్తగూడెంలోని పార్టీ ఆఫీస్లో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు.
అనంతరం అశ్వారావుపేటలోని ఊట్లపల్లి రోడ్డు మూడో కిలోమీటర్ రాయి పామాయిల్ తోట వద్ద మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నామా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్లో మాట్లాడింది లేదన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ స్థానం చెరిగిపోలేదని చెప్పారు.
కొంత మంది నేతలు పోయినంత మాత్రానా పార్టీకి పెద్దగా నష్టమేమీ ఉండదన్నారు. పార్టీలకతీతంగా తనకు ఓట్లు వస్తాయన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి వ్యవసాయానికి నీళ్లు ఇచ్చినందునే దేశంలో వరి పండించడంలో నంబర్ వన్ స్థానంలో నిలిచామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు తాగు, సాగు నీటి కోసం ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పాలేరు ఎండిపోయిందని, ఖమ్మంలో తీవ్ర స్థాయిలో తాగునీటి ఎద్దడి నెలకొందని చెప్పారు. పంటలు చేతి కొచ్చే టైంలో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పాలకులు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. కాగా కొత్తగూడెంలోని మీటింగ్కు జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, నాయకులు కోనేరు సత్యనారాయణ, ఎడవల్లి కృష్ణ అటెండ్ కాకపోవడం చర్చానీయాంశంగా మారింది.