21న మొదలుకానున్న నాగోబా జాతర

21న మొదలుకానున్న నాగోబా జాతర

ఇచ్చోడ, వెలుగు :పుష్యమాసం అమవాస్యను పురస్కరించుకొని ఆదివారం నెలవంక చూసిన ఆదిలాబాద్​జిల్లా ఇంద్రవెల్లి మెస్రం వంశీయులు సోమవారం గంగాజల యాత్ర, నాగోబా మహాయాత్ర కోసం ప్రచార యాత్ర ప్రారంభించారు. జనవరి 1 నుంచి గంగాజల యాత్ర నిర్వహించనుండగా, 21న నాగోబా మహాపూజ, జాతర మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మెస్రం వంశీయులు కేస్లాపూర్ లోని నాగోబా ఆలయం వద్ద ఉన్న మెస్రం మురాడి వద్ద సోమవారం సమావేశమయ్యారు. ప్రచార యాత్ర, గంగాజల యాత్ర, మహా పూజ, జాతర నిర్వహణపై చర్చించారు. ప్రత్యేక పూజలు చేసి ప్రచార రథాన్ని ప్రారంభించారు. -ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​జనార్దన్​ రాథోడ్ ​పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం ప్రచార రథాన్ని మెస్రం వంశంలోని అల్లుడు గ్రామ పొలిమేర వరకు తీసుకెళ్లగా..అక్కడ నాగోబా ఆలయ కటోడా మెస్రం కోసేరావ్ (పూజారి), ప్రధాన్ పెద్ద మెస్రం దాదారావ్ ఆధ్వర్యంలో యాత్ర ప్రారంభించారు. మొదటి రోజు సిరికొండలోని కుమ్మరి స్వామి వద్ద మహా పూజకు అవసరమయ్యే కుండల తయారీకి ఆర్డర్​ ఇచ్చారు. అక్కడి నుంచి వెళ్లి సిరికొండ మండలంలోని రాజంపేట్ లోని  మెస్రం వంశీయుల ఇండ్లలో బస చేశారు. 27న గుడిహత్నూర్ మండలంలోని సోయంగూడ, 28న ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెర, 29న ఉట్నూర్ మండలంలోని సాలెవాడ, 30న ఇంద్రవెల్లి మండలంలోని వడగాం గ్రామాల్లో ప్రచారం నిర్వహించి 31న కేస్లాపూర్ లోని మడావి వంశస్థుల ఇంటికి చేరుకుంటారు.

జనవరి 1న కేస్లాపూర్ లో ఉన్న నాగోబా మురాడి వద్దకు వెళ్లి సమావేశమవుతారు. తర్వాత గంగా జల సేకరణ రూట్​ గురించి చర్చిస్తారు. ప్రత్యేక పూజల మధ్య గంగా జల పాదయాత్రను ప్రారంభిస్తామని నాగోబా ఆలయ పెద్ద మెస్రం వెంకట్రావ్ తెలిపారు. జన్నారం మండలంలోని గోదావరి హస్తిన మడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో జనవరి 21న మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో మహా పూజ నిర్వహించి నాగోబా జాతర  ప్రారంభిస్తామని తెలిపారు. మెస్రం వంశ పెద్దలు చిన్న మెస్రం రావ్, ఆనందరావ్, తుకారాం, దాదారావ్, తిరుపతి, వంశు ఉద్యోగస్తులు దేవు, శేఖర్ బాబు, సోనేరావ్ పాల్గొన్నారు.