- గంగాజలంతో కేస్లాపూర్ శివారులోకి చేరుకున్న మెస్రం వంశీయులు
- 30న గిరిజన కళాకారులతో
- భారీ ప్రదర్శన, 31న ప్రజాదర్బార్
- రూ. కోటి ఖర్చుతో మౌలిక వసతులు
- ఏర్పాటు చేస్తున్న ఆఫీసర్లు
- 100 సీసీ కెమెరాలు, 500 మంది పోలీసులతో బందోబస్తు
ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు ముస్తాబవుతోంది. ఈ నెల 28న రాత్రి 10.30 గంటలకు నాగోబా ఆలయంలో మహాపూజ చేయడంతో ప్రారంభం కానున్న జాతర 31న ముగుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానుండడంతో ఆఫీసర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్భు గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించి ఆఫీసర్లు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు
నాగోబా మహాపూజ కోసం హస్తినమడుగులో సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్ చేరుకున్నారు. శనివారం గ్రామ పొలిమేరలోని మర్రిచెట్టు వద్ద బస చేశారు. హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలాన్ని మర్రిచెట్టుపైన భద్రపరిచారు. ఈ రెండు రోజుల పాటు అక్కడే బస చేయనున్న మెస్రం వంశీయులు 28న నాగోబా ఆలయానికి చేరుకొని గంగాజలంతో శుద్ధి పూజలు చేయడంతో మహాజాతర ప్రారంభం అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 22 కితలకు చెందిన మెస్రం వంశీయులు ఇప్పటికే ఎడ్లబండ్లపై కేస్లాపూర్ చేరుకుంటున్నారు.
మొదటి సారి భారీ కళా ప్రదర్శన
నాగోబా జాతర సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ప్రజాదర్బార్‌లో కళాకారుల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడం సర్వసాధారణం. అయితే ఈ ఏడాది మాత్రం.. ఒకరోజు ముందుగానే ఈ నెల 30న గిరిజన కళాకారులతో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి ట్రైబల్ కళాకారులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ నెల 31న ప్రజాదర్బార్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
జాతర నిర్వహణకు రూ. కోటి మంజూరు
నాగోబా జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసింది. ఈ నిధులతో తాత్కాలికంగా 50 టాయిలెట్స్, 40 వాటర్ ట్యాంక్‌లు, స్టేజ్ అరేంజ్‌మెంట్స్, పారిశుద్ధ్య, మౌలిక వసతులు కల్పించనున్నారు. కేస్లాపూర్‌కు వచ్చే రోడ్డు మార్గాలకు ఐటీడీఏ ఆఫీసర్లు ఇప్పటికే రిపేర్లు పూర్తి చేశారు. అటు జాతర పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఐదు రూట్లలో జాతరకు వచ్చే భక్తుల కోసం దర్శనం ఎటువైపు, పార్కింగ్, క్యూ లైన్లు, ఇతర సదుపాయాలు ఎక్కడెక్కడ ఉంటాయన్న వివరాలతో రూట్‌మ్యాప్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ఈ సారి జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వినియోగించకుండా నిషేధం విధించారు. ఐటీడీఏ నుంచి క్లాత్ బ్యాగులను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరితో పాటు విద్యార్థులతో హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంనుంచి నాగోబా జాతర వరకు ప్రత్యేకంగా బస్సును నడిపించేందకు చర్యలు తీసుకుంటున్నారు.