ఆదిలాబాద్, వెలుగు : గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా..ఏండ్ల తరబడిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ మెస్రం వంశీయులు తమ ఆరాధ్య దైవమైన నాగోబాకు అభిషేకం చేసి జాతర ప్రారంభించారు. సోమవారం ఉదయమే మర్రిచెట్టు వద్ద జొన్న గట్కతో ఉండలుగా ప్రసాదం తయారు చేశారు. అనంతరం డోలు, కాశీకోమ్, పెప్రే వాయిస్తూ కేస్లాపూర్ లోని మురాడి
దేవస్థానం నుంచి గంగాజలం, నాగోబా ఉత్సవ విగ్రహం, పూజ సామాగ్రి, దీపాలు తీసుకొని నాగోబా టెంపుల్కు వచ్చారు. ముందుగా ఆలయం ముందున్న మైసమ్మకు పూజలు చేసి నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లారు. వంశంలోని పెద్దలు 22 కితల(కుటుంబాలు) వారీగా కొత్త మట్టి కుండలను ఇవ్వగా మెస్రం అల్లుళ్లు, ఆడపడుచులు వాటితో మర్రిచెట్టు దగ్గర ఉన్న కోనేటిలో నీళ్లను తీసుకొని ఆలయానికి వెళ్లారు. టెంపుల్పక్కనే ఉన్న పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా, ఆ మట్టితో ఆడపడుచులు కొత్త పుట్టలు తయారు చేశారు. ఆ మట్టితో బౌల దేవతలను, సతీ దేవతల తయారు చేసి సాయంత్రం వరకు పూజలు చేశారు.
రాత్రి మహాపూజతో ప్రారంభం
హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో రాత్రి 10 నుంచి 11 గంటల వరకు నాగోబా ఆలయాన్ని శుద్ది చేశారు. నాగోబా విగ్రహానికి అభిషేకం చేసి మహాపూజ చేసి జాతర ప్రారంభించారు. తర్వాత గిరిజనులు, ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, భక్తులు నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి కొత్త కోడళ్లతో బేటింగ్ (పరిచయం) నిర్వహించారు. ఈ కార్యక్రమం తర్వాత వారిని మెస్రం వంశీయులుగా
ప్రకటించారు.