ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో నేటి నుంచి మూడురోజులపాటు జరగనున్న నాగోబా జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కేస్లాపూర్ తరలివచ్చి నాగోబాకు పూజలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాతరను ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు డీఏస్పీల ఆధ్వర్యంలో, ఆరుగురు సీఐలు, 28 మంది ఎస్సైల, 37 మంది ఏఎస్సైలు, 94 మంది హెడ్ కానిస్టేబుళ్లు 94, 243 మంది ఇతర సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.
అర్ధరాత్రి మహాపూజతో జాతర ప్రారంభం..
శుక్రవారం అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభమవుతుంది. 9,10,11 తేదీల్లో జరిగే జాతర 12న దర్బార్తో ముగుస్తుంది. మెస్రం వంశీయులు ఇప్పటికే 80 కిలోమీటర్ల దూరంలోని హస్తిన మడుగు దాకా వెళ్లి తీసుకొచ్చిన గోదావరి జలాలను కేస్లాపూర్ లోని మర్రిచెట్టు వద్ద కు చేర్చారు. బుధవారం అర్దరాత్రి పెద్దలకు కార్మకాండ ( తూమ్ ) పూజలు నిర్వహించారు. నాగోబా మహాపూజ, సంప్రదాయ పూజల కోసం సిరికొండ మండలంలో తయారు చేయించిన మట్టికుండలు ఆలయానికి చేరుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి గంగాజలంతో నాగోబాకు అభిషేకం తర్వాత జాతరను ప్రారంభిస్తారు. తర్వాత కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు పూజలు చేస్తారు. జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్ష మందిపైగా తరలివస్తారు. 12న దర్బార్ నిర్వహించనున్నారు.
రోజుకో ప్రత్యేక పూజ..
ప్రతిరోజు ప్రత్యేక రీతిలో పూజలు నిర్వహిస్తారు. మెస్రం వంశీయులు మట్టితో పుట్టను తయారు చేయడంలో మెస్రం చేస్తారు. మహాపూజ తర్వాత రాత్రి ఒంటిగంట తర్వాత భేటింగ్( కొత్త కోడళ్ల పరిచయం) నిర్వహిస్తారు. ఇప్పటి వరకు నాగోబా ఆలయానికి రాని మెస్రం వంశ కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి భేటింగ్ అనంతరం సతీ దేవత ఆలయంలో పూజలు చేస్తారు. ఆతర్వాత పెద్దల ఆశీర్వాదంతో పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. మరుసటి రోజు పెర్సపేస్, బాన్పేస్, మండగాజిలిపూజ, బేతల్ పూజ నిర్వహిస్తారు.