గుడిహత్నూర్, వెలుగు: ఆదివాసీల అతిపెద్ద పండుగ నాగోబా జాతర ఈనెల 9న ప్రారంభం కానుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. మంగళవారం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తాతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దర్బార్ హాలులో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగోబా జాతర ఈనెల 9న మహాపూజలతో ప్రారంభమవుతుందని, 12న దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు.
జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆలయం వద్ద బారికేడ్లు పెట్టి పురుషులు, మహిళలు వేర్వేరుగా క్యూలైన్లలో వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతరలో తాగునీటి సౌకర్యాలతో పాటు టాయిలెట్లు, బాత్రూంలు పెట్టాలన్నారు. నాగోబా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని, కోనేరును శుభ్రపరచాలన్నారు. జాతరలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు.
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీసీ కెమెరాలు అమర్చాలని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఖానాపూర్ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయంతో పనులు చేయాలన్నారు. మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకు ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు.
ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. నాగోబా జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీరు, పరిసరాల శుభ్రత, మరుగుదొడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల వంటి ఏర్పాట్లతో పాటు భక్తులు, ప్రముఖులు, అధికారులకు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ బందోబస్తు కోసం 600 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.