- గురువారం పెర్సపేన్, బాన్ దేవతలకు మెస్రం వంశీయుల పూజలు
- ఇవాళ (జనవరి 31) ప్రజాదర్బార్, హాజరుకానున్న ఆఫీసర్లు
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో మొదలైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇందులో భాగంగా గురువారం మెస్రం వంశీయులు పెర్సపేన్, బాన్ దేవతలకు పూజలు చేశారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ గోవడ్ నుంచి బాన్ దేవత ఆలయానికి చేరుకోగా, భేటింగ్ అయిన కొత్త కోడళ్లు కోనేరు నుంచి పవిత్ర జలాన్ని సేకరించారు. మెస్రం వంశ అల్లుండ్లు ఆలయం దగ్గర్లోని పాత పుట్టలను తొలగించగా, ఆడపడుచులు, మహిళలు కొత్త పుట్టలను తయారు చేశారు.
అనంతరం బాన్ దేవతలను శుద్ధి చేసి నాలుగు సగల పెర్సపేన్‌ను కొలిచారు. గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో శుద్ధి చేసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన్ కిత పెద్దలు కిక్రి వాయిస్తూ కొత్త కోడళ్లు, మెస్రం వంశ మహిళలకు నాగోబా చరిత్రను బోధించారు. జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు 10 వేల మంది రావడంతో దర్శనానికి గంట టైం పట్టింది.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నాగోబా జాతరలో భాగంగా మొదటి సారి భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన కళాకారులు చేసిన ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన పరార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృక్ష సంపద, పర్యావరణ పరిరక్షణలపై ప్రదర్శన నిర్వహించారు.