మహా పూజ.. కొత్త కోడళ్ల బేటింగ్

ఆదిలాబాద్, వెలుగు: మహాపూజతో సోమవారం రాత్రి నాగోబా జాతర ప్రారంభం కాగా, మెస్రం వంశీయులు, అధికారులు అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రత్యేక పూజలు చేశారు. మహాపూజ అనంతరం ఒంటి గంట నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 72 మంది కొత్త కోడళ్లు బేటింగ్ నిర్వహించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలోని గోవడ్ లో బస చేసిన మెస్రం వంశీయులు 22 కితల వారీగా పొయ్యిలు పెట్టి మట్టికుండల్లో జొన్న గట్కను వండి నాగోబాకు నైవేద్యంగా సమర్పించారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోవడ్​లో మాత్రమే ఈ పొయ్యిలు ఏర్పాటు చేస్తారు. మెస్రం వంశీయుల్లో ఎన్ని వేల మంది నాగోబాకు వచ్చినా 22 పొయ్యిలు మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఈ పొయ్యిల మీదనే వంతులవారీగా వంటలు చేసుకున్నారు. బుధవారం ప్రధాన ఆలయం వెనుక పెర్సపేన్ పూజలు చేయనున్నారు. ఈ పూజలో పురుషులు మాత్రమే పాల్గొంటారు.