
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నాగోబా మహాజాతర జనవరి 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరుగుతోంది. ప్రతి ఏటా పుష్య మాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మహాపూజలతో మెస్రం వంశస్తులు ఈ జాతరను ప్రారంభించారు. నాగోబా (శేషనారాయణమూర్తి) ఆదివాసీల ఆరాధ్య దైవం.తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. దేశంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి పొందింది. సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత.
నాగోబా జాతర గోండుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. గిరిజన సంస్కృతి, ఆచారాలు, విశ్వాసాలకు అద్దం పట్టే వేడుక. ఈ జాతరను సంరక్షించడం అంటే మన సంస్కృతిని సంరక్షించడమే. ఈ జాతరలో ప్రకృతిని పూజిస్తారు. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగా జలంతో నాగోబాను అభిషేకిస్తారు.
జాతర సందర్భంగా నాగోబా అభిషేకానికి అవసరమయ్యే గంగాజలం(గోదావరి నదీ జలం) కోసం మెస్రం వంశీయులు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నుంచి మహా పాదయాత్ర చేపట్టి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు మీదుగా ప్రవహించే గోదావరి నది నుంచి వీరు గంగాజలం సేకరిస్తారు. వీరు రానుపోను 215 కి.మీ. మేర కాలినడకన ప్రయాణిస్తారు.