ఇవాళ ( జనవరి 28 ) నాగోబా జాతర ప్రారంభం

ఇవాళ ( జనవరి 28 ) నాగోబా జాతర ప్రారంభం
  • రాత్రి 10.30 గంటలకు గంగాజలంతో అభిషేకం చేయనున్న మెస్రం వంశీయులు
  • హాజరుకానున్న కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు
  • బందోబస్తుపై ఎస్పీ రివ్యూ

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్‌‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌‌లో జరగనున్న నాగోబా మహా జాతర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో రాత్రి 10.30 గంటలకు మెస్రం వంశీయులు అభిషేకం చేయనున్నారు. దీంతో జాతర ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతర ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్‌‌ రాజర్షి షా, ఎంపీ నగేశ్‌‌, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌‌ హాజరుకానున్నారు.

రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే నాగోబాకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌, మధ్యప్రదేశ్‌‌ నుంచి సైతం భక్తులు తరలిరానున్నారు. మెస్రం వంశీయులతో పాటు ఆదిలాబాద్‌‌ ఉమ్మడి జిల్లాకు చెందిన గిరిజనులు ఇప్పటికే కేస్లాపూర్‌‌ చేరుకుంటున్నారు. జీతర కోసం అదిలాబాద్, ఉట్నూర్‌‌, ఆసిఫాబాద్‌‌ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. జాతర ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ ఎంపీ సోయం బాపూరావు పరిశీలించారు. 

600 మంది పోలీసులతో బందోబస్తు : ఎస్పీ

ఆదిలాబాద్‌‌టౌన్‌‌, వెలుగు : నాగోబా జాతరలో బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ గౌస్‌‌ ఆలం, ఉట్నూర్‌‌ ఏఎస్పీ కాజల్‌‌ సింగ్‌‌ సోమవారం పోలీసులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతరలో బందోబస్తు నిర్వహణకు 600 మంది పోలీసులను కేటాయించామని చెప్పారు. మరో వైపు 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు, ఆఫీసర్లు గిరిజనులు, మెస్రం వంశీయుల సంప్రదాయాలను గౌరవిస్తూ డ్యూటీ చేయాలని సూచించారు. డ్యూటీలో నిర్లక్ష్యం చేసే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు సీహెచ్‌‌.నాగేందర్‌‌, పోతారం శ్రీనివాస్, ఉట్నూర్‌‌ సీఐ మొగిలి, నార్నూర్‌‌ సీఐ రహీం పాషా, సీసీఎస్‌‌ సీఐ చంద్రశేఖర్‌‌, ఎస్సై డి.సునీల్‌‌
పాల్గొన్నారు.

నాగోబా.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక : మంత్రి సురేఖ

నాగోబా జాతర ప్రారంభాన్ని పురస్కరించుకొని మంత్రి కొండా సురేఖ ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీలు అత్యంత నిష్టతో ఆచరించే పూజా విధానం ఎంతో గొప్పదన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన నాగోబా జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.