ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్లో నాగోబా ఆలయం పున:ప్రారంభోత్సవ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుండి ఈనెల 18 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మెస్రం వంశస్తులు సాంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. 18న నాగోబా విగ్రహం పున:ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. మొత్తం ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆధ్మాత్మిక ప్రవచనాలు, భజన వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
సొంత నిధులతో..
కేస్లాపూర్‌లో మెస్రం వంశీయులు తమ సొంత నిధులతో నూతన నాగోబా ఆలయాన్ని నిర్మించారు. 2018లో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. నాగోబా జాతరతో పాటు ఆలయ విశిష్టత, చరిత్రను భావితరాలకు అందించాలన్న లక్ష్యంతో మెస్రం వంశస్తులు తమ సొంత డబ్బులతో కొత్త నాగోబా ఆలయ నిర్మాణాన్ని మొదలు పెట్టారు. పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెస్రం వంశీయులు నివాసం ఉండే ఊరురా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విరాళాలు సేకరించారు. 2 వేల మెస్రం వంశీయుల కుటుంబాల ద్వారా విరాళాలు సేకరించారు. దాదాపు రూ. 5కోట్లతో నాగోబా ఆలయంతో పాటు సతీ దేవత ఆలయాల నిర్మాణాలను పూర్తి చేశారు.
నాగోబా ఆలయ శిల్పకళ..
నూతన నాగోబా ఆలయాన్ని గ్రానైట్ రాయితో నిర్మించారు. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుంచి ప్రత్యేక గ్రానైట్ రాయిని తెప్పించారు. ఆలయ స్తంభాలపై నాగోబా దేవతకు సంబంధించిన వివిధ రకాల శిల్పాలను చెక్కించారు. అటు నూతన నాగోబా ఆలయం శిల్ప కళ సౌందర్యంతో కొత్తకళను సంతరించుకుంది.
గుడిసెలో నాగోబా దేవతకు పూజలు..
వేల సంవత్సరాల క్రితం మెస్రం వంశీయులు చిన్నగుడిసెలో నాగోబా దేవత కు పుష్య మాసంలో మహా పూజలు నిర్వహించే వారు. 1956లో తొలిసారిగా చిన్న గుడిని నిర్మించి నాగోబా జాతర ఉత్సవాలు జరిపారు. ఆ తర్వాత మెస్రం వంశీయుల విన్నపం మేరకు ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న జీ.నగేశ్ అప్పట్లో రూ.3.80 లక్షలతో రెండోసారి నాగోబా ఆలయంతో పాటు గర్భగుడి, సతీదేవత గుడి, ఆలయ మండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి మెస్రం వంశీయులు అదే ఆలయంలో నాగోబా జాతరను నిర్వహించారు. అయితే ప్రతీ ఏడాది నాగోబా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో మెస్రం వంశీయులు నూతన నాగోబా ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే విరాళాలు సేకరించి..విశాల ఆలయాన్ని నిర్మించారు.