మరికల్, వెలుగు: చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జనాలపై పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమని, ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా ఎన్నో రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
ఈ ఘటనలో రెచ్చగొట్టింది ఎవరు? ఘటనకు కారకులెవరు? నాయకులా, కంపెనీ వాళ్లా పోలీసులు తేల్చాలన్నారు. జనం చేస్తున్న ఆందోళన బట్టి చూస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు ఉన్నాయని, పొల్యూషన్ ఎంత వరకు వస్తుందో తెలియజేయలన్నారు. జీరో పర్సెంట్ పొల్యుషన్ పేరుతో పర్మిషన్లు ఉన్నాయని కంపెనీ వారు చెబుతూ వ్యర్థాలను బయటపోయడం సరైంది కాదన్నారు.
పోలీసులు, కంపెనీ వాళ్లు నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లాఠీచార్జీ ఘటనపై వెంటనే సీబీఐ విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. నర్సన్గౌడ్, తిరుపతిరెడ్డి, ఎం.వేణుగోపాల్ పాల్గొన్నారు.