రెండోసారి: హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాయబ్ సైనీ

రెండోసారి: హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాయబ్ సైనీ

చండీఘర్: హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణం స్వీకారం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నాయబ్ సింగ్ సైనీ చేత సీఎంగా ప్రమాణం స్వీకారం చేయించారు. చండీగఢ్ సమీపంలోని పంచకుల పరేడ్ గ్రౌండ్‌లో 2024, అక్టోబర్ 17న జరిగిన ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర నేతలు హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులు అటెండ్ అయ్యారు. 

కాగా, ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించిన విషయం తెలిసిందే. 90 సీట్లలకుగానూ 48 స్థానాలను కైవసం చేసుకుని ముచ్చటగా మూడోసారి హర్యానా గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడించింది. లాడ్వా అసెంబ్లీ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగిన సైనీ.. సమీప కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తు చేసి ఘన విజయం సాధించారు. ఈ క్రమంలోనే 2024, అక్టోబర్ 16న హర్యానా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో నాయబ్ సింగ్ సైనీని ఏకగ్రీవంగా బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ మేరకు నాయబ్ సింగ్ సైనీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 

ఎవరీ నాయబ్ సింగ్ సైనీ..?

1970లో జన్మించిన నాయబ్ సింగ్ సైనీ.. బీజేపీ సీనియర్ లీడర్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆధ్వర్యంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మొదటిసారిగా 2014లో నరైంఘర్ అసెంబ్లీ స్థానం నుండి సైనీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండు సంవత్సరాల్లోనే సైనీని అమాత్య పదవి వరించింది. 2016లో మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్‎లోకి  మంత్రిగా సైనీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో సైనీ కురుక్షేత్ర పార్లమెంట్ స్థానం నుండి ఎంపీ బరిలోకి దిగారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మల్‌ని ఓడించి కురుక్షేత్ర నుండి ఎంపీగా విజయం సాధించారు. 

ALSO READ | హర్యానా సీఎంగా నేడు సైనీ ప్రమాణం : బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక

ఆ తర్వాత హర్యానాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది (2024) మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సైనీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల్లోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. సైనీ నేతృత్వంలోని బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. హర్యానాలో బీజేపీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది. దీంతో నాయబ్ సింగ్ సైనీ రెండోసారి హర్యానా సీఎం ఎన్నికయ్యారు.