హర్యానా సీఎంగా సైనీ ప్రమాణం

హర్యానా సీఎంగా సైనీ ప్రమాణం
  • కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు
  • ఎన్డీయే కూటమికి చెందిన18 మంది సీఎంలు కూడా
  •  పేదల సంక్షేమానికే ప్రాధాన్యం: సీఎం సైనీ
  • ఈ ప్రభుత్వం సుపరిపాలన, అనుభవాల కలయిక: మోదీ

చండీగఢ్:హర్యానా కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైనీ(54 ) రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం చండీగఢ్ సమీపంలోని పంచకుల పరేడ్ గ్రౌండ్‌‌‌‌లో గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీతో ప్రమాణం చేయించారు. ఇద్దరు మహిళలతో సహా13 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. అనిల్ విజ్, క్రిషన్ లాల్ పన్వార్, రావ్ నర్బీర్ సింగ్, మహిపాల్ దండా, విపుల్ గోయెల్, అరవింద్ కుమార్ శర్మ,  శృతి చౌదరి(మహిళ),  శ్యామ్ సింగ్ రాణా, రణబీర్ సింగ్ గాంగ్వా, క్రిషన్ బేడీ, గౌరవ్ గౌతమ్, ఆర్తి సింగ్ రావు(మహిళ), రాజేశ్ నగర్ లతో హర్యానా కొత్త కేబినెట్ ఏర్పడింది. 

ఈ కార్యక్రమానికి  ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌‌‌‌నాథ్ సింగ్‌‌‌‌, నితిన్ గడ్కరీ, రాజీవ్ రంజన్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. మొత్తం 18 మంది సీఎంలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు అటెండ్ అయ్యారు. ప్రముఖ నేతలంతా అటెంట్ కావడంతో పంచకుల పరేడ్ గ్రౌండ్‌‌‌‌ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు  సైనీ, బీజేపీ ఎమ్మెల్యేలు పంచకులలోని వాల్మీకి ఆలయం, గురుద్వారా, మానస దేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొత్త ప్రభుత్వం ఓ అద్భుత మిశ్రమం: మోదీ

హర్యానా కొత్త ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం నాయబ్ సింగ్ సైనీ, ఆయన మంత్రివర్గ సహచరులను అభినందించారు. హర్యానా కొత్త టీం సుపరిపాలన, అనుభవంతో కూడిన అద్భుత మిశ్రమమని ప్రశంసించారు. సైనీ ప్రభుత్వం హర్యానా ప్రజల కలలను సాకారం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పేదలు, రైతులు, యువకులు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొంటూ మోదీ ట్వీట్ చేశారు.

సైనీకి 30 ఏండ్ల రాజకీయ అనుభవం

ఓబీసీ వర్గానికి చెందిన సైనీ 1970 జనవరి 25న అంబాలాలో జన్మించారు. అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం, చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి తన డిగ్రీ, న్యాయ పట్టాలను పొందారు. 1996 నుంచి బీజేపీ హర్యానా యూనిట్‌‌‌‌లో చురుకుగా పనిచేస్తున్నారు. 2002లో పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మొదటిసారిగా 2014లో నరైంఘర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

2016లో ఖట్టర్ కేబినెట్‌‌‌‌లోకి ప్రవేశించారు. 2019 కురుక్షేత్ర లోక్‌‌‌‌సభ నుంచి పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచే ఆయనకు పార్టీలో  ప్రాముఖ్యత పెరిగింది. 2023 అక్టోబర్‌‌‌‌లో హర్యానా బీజేపీ చీఫ్‌‌‌‌గా నియమితులయ్యారు. 2024 మార్చి 12న సైనీ తొలిసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇక ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ అనూహ్య విజయాన్ని అందుకుంది. 

మొత్తం 90 సీట్లల్లో  48 సీట్లు గెలిచి వరుసగా మూడో సారి అధికారం దక్కించుకుంది. అనంతరం సీఎం ఎంపికపై జరిగిన చర్చల్లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన సైనీ వైపే అంతా మొగ్గు చూపారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష భేటీలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ నేపథ్యంలో గురువారం సైనీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

హామీలన్నీ అమలు చేసి తీరుతం

ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం నాయబ్ సింగ్ సైనీ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో హర్యానాను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు బీజేపీ కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. " మోదీ ప్రభుత్వ విధానాలపై హర్యానా ప్రజలకు విశ్వాసం ఉందన డానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. బీజేపీ 'సంకల్ప్‌‌‌‌ పత్ర(మేనిఫెస్టో)'ను పూర్తిగా అమలుచేస్తం. 

హర్యానా బీజేపీ ప్రకటించిన 2014 సంకల్ప్ పత్రను, 2019 సంకల్ప్ పత్రను చూడండి. రెండు పర్యాయాల్లో మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను పూర్తిగా అమలు చేశాం. ఇప్పుడు కూడా 2024 సంకల్ప పత్రాన్ని మా ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుంది. రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సుపరిపాలన, సమానత్వం, పేదల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తం" అని సైనీ చెప్పారు.