మంచిర్యాల, వెలుగు : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ఇచ్చిన హామీ ప్రకారం తుమ్మిడిహెట్టి, కుప్టి ప్రాజెక్టులు నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్, తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సాధనకు కార్యచరణ ప్రణాళిక కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్లో సోమవారం అఖిలపక్షం లీడర్ల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.
లీడర్లు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తిచేసి, ప్రాణహిత, కుప్టి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలన్నారు. శ్రీరామ్ సాగర్ ఉత్తర కాలువ, మందాకిని కాలువ నిర్మించి చెన్నూరు ప్రాణహిత వరకు సాగునీరు అందించాలని కోరారు.
కుమ్రం భీం, జగన్నాథ్ పూర్, న్యూ సదర్ మాట్, నీల్వాయి, గొల్లవాగు తదితర ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్, కె.జయరావు తదితరులు పాల్గొన్నారు.