తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్.. ఆయన ముందున్న టార్గెట్ ఏంటంటే..

తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్.. ఆయన ముందున్న టార్గెట్ ఏంటంటే..

చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తిరునెల్వేలి బీజేపీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్కు శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నాగేంద్రన్ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. టి.నగర్లోని బీజేపీ తమిళనాడు రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష స్థానం కోసం నామినేషన్ దాఖలు చేసిన తొలి అభ్యర్థి నాగేంద్రన్ కావడం గమనార్హం.

అన్నామలై కూడా నైనార్ నాగేంద్రన్ పేరునే తమిళనాడు బీజేపీ అధ్యక్ష స్థానానికి ప్రతిపాదించారు. తమిళనాడు బీజేపీ నేతలు ఈ ప్రతిపాదనకు పచ్చ జెండా ఊపడంతో తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ బాధ్యతలు స్వీకరించడం దాదాపు ఖాయమైంది. ఏప్రిల్ 12న ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో నైనార్ నాగేంద్రన్ పేరును బీజేపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించనుంది. నైనార్ నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కొనసాగారు.

తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి కె. అన్నామలై తప్పుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి రేసులో తాను లేనని ఆయన స్పష్టం చేయడంతో తమిళనాడు బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరనే చర్చ జరిగింది. నైనార్ నాగేంద్రన్ నామినేషన్తో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి విషయంలో స్పష్టత వచ్చింది. 2026లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు కళ్లెం వేయాలని బీజేపీ డిసైడ్ అయింది.

అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామితో అమిత్ షా భేటీ అయ్యి చర్చలు జరిపారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు అంగీకరించిన పళనిస్వామి తమిళనాడులో అన్నామలైని పదవి నుంచి తొలగించాలని కోరినట్లు సమాచారం.