నైనీ కోల్‌‌ బ్లాక్‌‌లో నెలాఖరుకు ఉత్పత్తి.. ఏటా 10 మిలియన్ ​టన్నుల టార్గెట్​

  • తొలిసారి పొరుగు రాష్ట్రంలోకి సింగరేణి
  • నైనీ బ్లాక్‌‌లో 38 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు 
  • ఏటా సింగరేణికి రూ.1,000 కోట్ల ఆదాయం.. 1,200 మందికి ప్రత్యక్ష ఉపాధి

కోల్​బెల్ట్/గోదావరిఖని, వెలుగు:​ సింగరేణి సంస్థ ఒడిశాలో బొగ్గు ఉత్పత్తికి రెడీ అవుతున్నది. తొలిసారి పొరుగు రాష్ట్రంలోని నైనీ కోల్ బ్లాక్‌‌లో ఉత్పత్తి ప్రారంభించనుంది. మూడేండ్లుగా ప్రొడక్షన్ కోసం సన్నాహాలు చేసినా ఫారెస్ట్, ఎన్విరాన్‌‌మెంట్ క్లియరెన్స్ రాకపోవడంతో ఒడిశా సర్కార్ సహకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అధికారులు ఒడిశా సర్కార్‌‌‌‌తో చర్చించడంతో జులైలో ఈ గనికి అనుమతులు వచ్చాయి. జనవరి మూడో వారం తర్వాత రూ.491 కోట్ల క్యాపిటల్‌‌తో గనిని ప్రారంభించేందుకు సింగరేణి ఏర్పాట్లు చేసింది.

ఒడిశాలోని అంగూల్ జిల్లా చండిపాడ తహసీల్ మహానది కోల్ ఫీల్డ్ పరిధిలోని నైనీ కోల్ బ్లాక్‌‌ను కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 13న సింగరేణికి కేటాయించింది. నైనీ బ్లాక్‌‌లో 912.7 హెక్టార్లలో బొగ్గు నిక్షేపాలు ఉండగా.. అందులో 783.27 హెక్టార్ల ఫారెస్ట్ భూమి ఉంది. ఇందులోనూ 643.09 హెక్టార్లు పూర్తి అడవి కాగా, మిగిలిన 140.18 హెక్టార్ల అటవీ భూమి ఆరు గ్రామాల పరిధిలో ఉంది. మొత్తం 9.12 చదరపు కిలోమీటర్ల పరిధిలో 350 మిలియన్ టన్నుల జీ-10 గ్రేడ్ క్వాలిటీ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి 2.58 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగిస్తే సరిపోతుంది. 

సింగరేణిలోని ప్రస్తుత ఓసీపీల్లో టన్ను బొగ్గు ఉత్పత్తికి 6 నుంచి 7 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి వస్తోంది. నైనీ బ్లాక్‌‌లో కేవలం 20 నుంచి 30 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉండటం వల్ల తక్కువ ఖర్చుతో వెలికి తీయడానికి అవకాశం ఉంది. దీనివల్ల సంస్థకు భారీ లాభాలు రానున్నాయి. ఏటా 10 మిలియన్ టన్నుల చొప్పున 38 ఏండ్ల పాటు బొగ్గును ఉత్పత్తి చేయొచ్చు. దీని ద్వారా సింగరేణికి ఏటా సుమారు రూ.1,000 కోట్ల వరకు ఆదాయం రానుంది. ప్రత్యక్షంగా 1,200 మందికి, పరోక్షంగా మరో 2 వేల మందికి ఉపాధి లభిస్తుంది. 

పర్మిషన్లలో జాప్యం..

నైనీ బ్లాక్ స్టేజ్-1కు 2021లో కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్‌‌మెంట్ పర్మిషన్ ఇచ్చింది. తర్వాత ఫారెస్ట్ స్టేజ్2 అనుమతి కోసం సింగరేణి సంస్థ ఒడిశా ప్రభుత్వానికి ఫైల్ పంపింది. ఇదే సమయంలో ‘ఏనుగుల కారిడార్’తెరపైకి వచ్చింది. నైనీ బ్లాక్‌‌కు 25 కిలోమీటర్ల దూరంలోని అడవుల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. బొగ్గు ఉత్పత్తి, రవాణా వల్ల వాటి మనుగడకు ప్రమాదం ఉందంటూ ఫారెస్ట్ పర్మిషన్ల విషయంలో ఒడిశా సర్కార్ జాప్యం చేసింది. అటవీ శాఖ నిబంధనలన్ని పాటిస్తామని హామీ ఇచ్చిన సింగరేణి సంస్థ.. ఫారెస్ట్ డిపార్ట్‌‌మెంట్‌‌కు ప్రత్యామ్నాయంగా భూమిని సమకూర్చింది. నైనీ బ్లాక్ నుంచి ప్రధాన రైల్వే మార్గాన్ని లింక్ చేస్తూ ట్రాక్​నిర్మాణం, ఆర్ అండ్ ఆర్, అనలిటికల్ సెంటర్, రోడ్డు ద్వారా కోల్ ట్రాన్స్‌‌పోర్టుకు​చెండిపాడు,-జరగాడ రోడ్డు నిర్మాణం, హైటెన్షన్ లైన్, సర్వేలు, ప్రభావిత గ్రామాల్లో మెడికల్ క్యాంపులు, డ్రింకింగ్ వాటర్ తదితర పనులకు సింగరేణి వందల కోట్లు ఖర్చు చేసింది.

సర్కార్ సంప్రదింపులతో స్పీడప్..

అటవీ, ఎన్విరాన్‌‌మెంట్ పర్మిషన్ల కోసం ఒడిశా ప్రభుత్వంతో గతంలో ఉన్న బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్, అప్పటి సింగరేణి సీఎండీ శ్రీధర్‌‌‌‌ సరిగ్గా సంప్రదింపులు జరుపలేదు. కాంగ్రెస్ సర్కార్ రాగానే సింగరేణి పెండింగ్​ప్రాజెక్టులపై దృష్టి సారించింది. నైనీ గని అనుమతులపై జులై 12న ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్​రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్ చర్చలు జరిపారు. దీంతో ఒడిశా సీఎం అనుమతులు ఇస్తూ ఆదేశాలిచ్చారు. నైనీ బ్లాక్ ఏరియాలో కూడా డిప్యూటీ సీఎం భట్టి సందర్శించారు. గని విస్తరించి ఉన్న ఛండిపడ ఎమ్మెల్యే ఆగస్తి బెహారా, నిర్వాసితులను కలిసి సహకారించాలని కోరారు. దీనివల్ల స్థానికులకు ఉపాధితో పాటు ఒడిశా ప్రభుత్వానికి ఏటా రాయల్టీ, డివిడెండ్ రూపంలో రూ.600 కోట్ల ఇన్‌‌కం వస్తుందని భరోసా ఇచ్చారు.

అటవీ భూముల్లో చెట్ల లెక్కింపు తర్వాత..

 స్టేజ్-2 అనుమతుల్లో భాగంగా 783.27 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి కేటాయించారు. ఇందులోని 250 ఎకరాల్లో ఉన్న అటవీ చెట్ల లెక్కింపు, తొలగింపు పనులు చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆ భూమిని ఒడిశా అటవీ శాఖ సింగరేణికి అప్పగించనుంది. ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధం కావడంలో సింగరేణి ఇప్పటికే ఓవర్ బర్డెన్ వెలికితీత టెండర్ పూర్తి చేసింది. నైనీ బ్లాక్ బొగ్గుతో సింగరేణి థర్మల్​విద్యుత్​ఉత్పాదన చేయాలన్న నిబంధన మేరకు గని సమీపంలో 1,600(2×800) మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌‌‌‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌‌కు కూడా నైనీకోల్ బ్లాక్​ బొగ్గును సప్లై చేయనున్నారు.