IND vs BAN: మా నెక్స్ట్ టార్గెట్ భారత్.. టీమిండియాకు బంగ్లాదేశ్ కెప్టెన్ ఛాలెంజ్

పాకిస్థాన్ పై సంచలన సిరీస్ విజయం తర్వాత బంగ్లాదేశ్ ఫుల్ జోష్ లో ఉంది. రావల్పిండి వేదికగా పాకిస్థాన్ పై రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకున్న బంగ్లాదేశ్.. అదే ఫామ్ ను భారత్ పై కొనసాగించాలని కోరుకుంటుంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్ పై బంగ్లాదేశ్ రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. భారత గడ్డపై ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ పై బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.   

"భారత్ పై జరగబోయే తదుపరి సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది. పాకిస్థాన్ పై విజయం మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మాకు ముషి, షకీబ్‌ల అనుభవం ఉంది. భారత్ లో ఆడేటప్పుడు వీరు చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మెహదీ హసన్ మిరాజ్ పిచ్ స్పిన్ కు అనుకూలించకపోయినా 5 వికెట్లు పడగొట్టాడు. భారత్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు అతను ఇదే ప్రదర్శన ఇస్తాడని కోరుకుంటున్నాం". అని శాంటో పాక్ పై సిరీస్ గెలిచిన అనంతరం చెప్పుకొచ్చాడు.

మంగళవారం (సెప్టెంబర్ 3) ముగిసిన రెండో టెస్టులో పాకిస్థాన్ పై బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.అంతకముందు జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లో భారత్ 68.52 శాతం విజయాలతో అగ్ర స్థానంలో కొనసాగుతుంది. 45.83 శాతంతో బంగ్లాదేశ్ నాలుగో స్థానానికి చేరుకుంది.