
- ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
శాలిగౌరారం(నకిరేకల్ ), వెలుగు: లయన్స్ క్లబ్‌ల సేవలు మరువలేనివని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం శాలిగౌరారం క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి సహకారం తో శాలిగౌరారం గ్రామ పంచాయతీ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆయన ఈ శిబిరాన్ని ప్రారంభించి, మాట్లాడారు. లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి, రోడ్ల మరమ్మతుకు, అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కలిపించేందుకు కృషి చేస్తానన్నారు.
డాక్టర్లు దాదాపు 300 మందికి కంటి పరీక్షలు చేసి, మందులు, అద్దాలు పంపిణీ చేశారు. 50 మందికి ఆపరేషన్ అవసరమని గుర్తించి, మొదటి విడతగా 20 మందిని సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కంటి ఆసుపత్రి ఛైర్మన్, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వుప్పల రాజేంద్రప్రసాద్, క్లబ్ రీజన్ ఛైర్మన్ గుడిపూడి వెంకటేశ్వరరావు, జోన్ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్, దాత చాడ రమేష్ చందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ నరిగే నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.