- ఆయన పాపాలన్నీ బయటకొస్తే రాష్ట్రంలో ఐదు నిమిషాలూ ఉండలేడు
- గన్నుతో ప్రభాకర్‌రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా?
- 1,300 మంది దళితులను డీటీసీలో చిత్రహింసలు పెట్టలేదా?
- దుర్మార్గాలు చేసి ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడ్తున్నడు
- తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్‌కు కారకుడు కేటీఆరేనని, ఆయన దుర్మార్గాలను బయటపెడ్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ పాత్రపై పూర్తి విచారణ జరపాలని, ఆయన పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘కేటీఆర్ చేసిన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో ఐదు నిమిషాలు కూడా ఉండలేడు. ఫోన్ ట్యాపింగ్ చేసింది, చేయించింది కేటీఆరే. చిరుమర్తి లింగయ్య కాదు కేటీఆరే దొంగచాటుగా ఫోన్ సంభాషణలు విన్నడు” అని ఆరోపించారు.
పాపాలు, దుర్మార్గాలు చేసిన కేటీఆర్ ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతున్నారని, ఆయన తీరు వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు ఉందని ఫైర్ అయ్యారు. గురువారం అసెంబ్లీలోని సీఎల్పీలో వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల పాపాలు బయటకు వస్తే కేటీఆర్ కు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గుర్తుకువస్తారని, తనలాంటి వారి విషయంలో మాత్రం దళితుడనేది ఆయనకు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అప్పట్లో నన్ను పిలిచి, టేబుల్ పై రివాల్వర్ పెట్టి బెదిరించి, వార్నింగ్ ఇచ్చిండు. ‘నీకు బతుకు మీద ఆశ లేదా.. నీకు భార్యా, పిల్లలు లేరా...పార్టీ మారి ఇబ్బందులు ఎందుకు తెచ్చుకుంటవ్’ అని నన్ను ప్రభాకర్ రావు చేత కేటీఆర్ బెదరించిండు. అప్పుడు నేను దళితుడిననే విషయం కేటీఆర్ కు గాని గుర్తుకు రాలేదా..?” అని వీరేశం ప్రశ్నించారు. కేటీఆర్ కూడా కాంగ్రెస్‌లోకి పోయి ఎందుకు సమస్యలు తెచ్చుకుంటావని బెదరించారని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన 1,300 మంది దళితులను నాడు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో పోలీసులు డీటీసీ (డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ) లో చిత్రహింసలకు గురిచేశారని, ఇప్పటికీ వారు నడవలేని స్థితిలో ఉన్నారని చెప్పారు.
బీఆర్ఎస్ను సమాజం క్షమించదు
గుమ్మడికాయ దొంగ అంటే కేటీఆర్ భుజాలు తడుముకుంటున్నారని, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ద్వారా కేటీఆర్ లగచర్ల కుట్ర చేశారని వేముల వీరేశం ఆరోపించారు. ‘‘అభివృద్ధిని అడ్డుకోవడానికి కేటీఆర్ నీచాతి నీచమైన కుట్రలకు పాల్పడుతున్నడు. అధికారులను అంతమొందించే కుట్రకు తెగించిండు” అని మండిపడ్డారు. దళిత, గిరిజన, బీసీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడానికి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం కొడంగల్ లో భూసేకరణ జరుపుతున్నదని తెలిపారు. పరిశ్రమలు వస్తే తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్లన్నసాగర్ కోసం గత ప్రభుత్వం 12 గ్రామాల ప్రజలను బెదిరించి, దౌర్జన్యం చేసి భూసేకరణ చేసింది. పదేండ్లు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని బీఆర్ఎస్ అమలు చేసింది. తెలంగాణ సమాజం ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీని క్షమించదు. అభివృద్ధి అనేది సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే జరగాల్నా? వెనుకబడిన నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అభివృద్ధి జరగొద్దా?” అని వీరేశం ప్రశ్నించారు.