పోలీసులు ప్రొటోకాల్ పాటిస్తలే

పోలీసులు ప్రొటోకాల్ పాటిస్తలే
  • స్పీకర్​కు ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: పోలీస్ అధికారులు ఎమ్మెల్యేల పట్ల ప్రొటోకాల్ పాటించట్లేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. బుధవారం బంజారాహిల్స్​లోని మంత్రుల క్వార్టర్స్ లో ఆయన స్పీకర్​ను కలిశారు. తన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు. గత నెల 30 న భువనగిరి ఎంపీ సెగ్మెంట్​లో జరిగిన ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ సందర్బంగా మంత్రుల కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు తాను వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.

అనంతరం వీరేశం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారలేదన్నారు. నల్గొండ జిల్లాలో ఒకరిద్దరు పోలీసు అధికారులు గత ప్రభుత్వంలో వ్యవహరించినట్లే ఇప్పుడూ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలనే గుర్తుపట్టని పోలీసులు ఎలా తమకు రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. అధికారులను పిలిపించి విచారిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారని తెలిపారు.  వీరేశంకు మద్దతుగా ఎమ్మెల్యేలు సత్యనారాయణ, లక్ష్మారెడ్డి స్పీకర్ వద్దకు వచ్చారు. 

చర్యలు తీస్కుంటం: గడ్డం ప్రసాద్

అసెంబ్లీ స్పీకర్ గా సభ్యుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని గడ్డం ప్రసాద్ అన్నారు. వేముల వీరేశం ఆవేదనను అర్థం చేసుకున్నానని, పూర్తి వివరాలు తెలుసుకుంటానని బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో స్పీకర్ పేర్కొన్నారు.