ఐదోసారీ.. గోషామహల్ చాక్నావాడిలో కుంగిన నాలా

ఐదోసారీ.. గోషామహల్ చాక్నావాడిలో  కుంగిన నాలా
  •  కుంగిన చోట మాత్రమే జీహెచ్ఎంసీ రిపేర్లు
  • 20 రోజుల కింద ఇదే ప్రాంతంలో కుంగిన నాలా
  • ఆ పనులు చేస్తుండగానే మరో ఘటన  
  • ఇప్పటికే పలు వాహనాలు ధ్వంసం, పలువురికి గాయాలు
  • 351 మీటర్ల మేర పైకప్పు ఉన్న చోటే తరచూ ప్రమాదాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గోషామహల్​లోని చాక్నావాడిలో పురాతన నాలా మరోసారి కుంగడం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. మంగళవారం రాత్రి  40 మీటర్ల మేర నాలా కుంగడంతో అక్కడే పార్క్ చేసి ఉన్న ఆటో, కారు, ట్రాక్టర్ అందులో పడి ధ్వంసమయ్యాయి. ఆ టైంలో అక్కడ జనాలు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 60 ఏండ్ల కింద నిర్మించిన నాలా కావడంతో పదేపదే కుంగుతోంది. జీహెచ్ఎంసీ మాత్రం కుంగిన చోటే రిపేర్లు చేస్తోంది. శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదు. ఏ టైంలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు.  

11 కిలోమీటర్ల మేర నిర్మాణం 

 మంగళ్ హాట్, బోయిగూడ కమాన్ నుంచి గోషామహల్ మీదుగా మూసీ వరకు 11 కిలోమీటర్ల మేర ఈ నాలాను 60 ఏండ్ల కిందట నిర్మించారు. పురాతనమైన నాలా కావడం, గోషామహల్ ప్రాంతంలో ఎక్కువగా టింబర్ డిపోలు ఉండటంతో ఈ రోడ్డుపై నుంచి డైలీ భారీ వాహనాలు వెళ్తుంటాయి. హెవీ లోడ్ పడినప్పుడల్లా నాలా కుంగుతోంది. అలాగే దారుస్సలాం నుంచి చాక్నావాడి వరకు దాదాపు 351 మీటర్ల మేర పైకప్పు ఉంది. దీనిపై రోడ్డు వేస్తుండడంతో ఒత్తిడి పెరిగి కూలిపోతోంది. 

కొత్తగా నిర్మిస్తామన్నరు..

2022లో మొదటిసారి ఘటన జరిగినప్పుడు ఇది పురాతనమైన నాలా అని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మిస్తామని అప్పటి బీఆర్ఎస్ మంత్రులు హామీ ఇచ్చారు. అయినా, ఎక్కడ కుంగిందో అక్కడే పనిచేసి ఊరుకున్నారు. దీంతో మిగతా ప్రాంతాల్లో తరచూ నాలా కుంగుతోంది. ప్రస్తుతం కుంగిన నాలా పనులను నెలరోజుల్లో పూర్తి చేస్తామని బల్దియా అధికారులు తెలిపారు. మరోసారి ఇటువంటి సంఘటనలకు జరగకుండా చర్యలు తీసుకుంటామని, పురాతన నాలాలు ఎన్ని ఉన్నోయో గుర్తించి చర్యలు తీసుకుంటామని పాత పాటే పాడారు. పురాతన నాలాలు ఎక్కువగా కోర్ సిటీలోనే ఉన్నాయి. ఎంసీహెచ్ ఉన్న టైంలో నిర్మించిన నాలాలు దాదాపు 3 వేల కిలోమీటర్ల మేర ఉండొచ్చని అధికారుల అంచనా. .

ఎంత ఖర్చయ్యిందంటే..? 

ఈ నెల 10న కుంగిన చోట రూ.2 కోట్ల అంచనాతో 60 మీటర్ల మేర పనులు కొనసాగుతుండగానే మంగళవారం మరోసారి కుంగింది. ఇక్కడ 60 మీటర్ల మేర రూ.2 కోట్ల అంచనాతో బుధవారం పనులు మొదలుపెట్టారు. ఈ పనులు నెలరోజుల్లో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇవి పూర్తయ్యాక మొత్తం మిగిలి ఉన్న నాలాను రెండు పార్ట్ లుగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.  .

ALSO READ : మూడ్రోజుల్లో కులగణన రిపోర్ట్.. అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం

ఇతర చోట్ల కూడా..

గతంలో గోషామహల్, హిమాయత్ నగర్, ఎంజీబీఎస్​– చాదర్ ఘాట్ మెయిన్​రోడ్డుపై, ఎన్టీఆర్ గార్డెన్ ముందు, కూకట్ పల్లిలోని ఉషాముళ్లపూడి రోడ్డు గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద రోడ్లు కుంగాయి. గతేడాది జనవరి 28న హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5లో రోడ్డు కుంగడంతో మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ ఇరుక్కుపోయింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే హిమాయత్ నగర్ లోని మినర్వా కాఫీ షాప్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై మ్యాన్​హోల్​కుంగింది. తర్వాత చాదర్ ఘాట్ మెయిన్​రోడ్డుపై 20 ఫీట్ల గుంత పడింది. సిటీలోని కొన్ని డ్రైనేజీలు, నాలాలు ఎప్పుడో నిర్మించినవి కావడంతో ఈ సమస్య ఏర్పడుతున్నదని నిపుణులు చెప్తున్నారు. ఇంకొన్నిచోట్ల పదేండ్ల కింద నిర్మించినవి కూడా కుంగుతున్నాయని, ఇందుకు పనుల్లో లోపమే కారణమంటున్నారు. 

ఒకటి కాదు.. రెండు కాదు

2022లో మంగళవారం కుంగిన చోటే 100 మీటర్ల మేర నాలా పైకప్పు కుంగింది. అప్పుడు అక్కడ పార్క్ చేసిన కార్లు, ఆటోలు, బైక్‌‌‌‌లు, కూరగాయల బండ్లు ధ్వంసమయ్యాయి. అక్కడున్న పలువురు గాయపడ్డారు. గతేడాది జులైలో మళ్లీ కుంగడంతో ఓ డీసీఎం అందులో పడిపోయింది. అదే ఏడాది అక్టోబర్ లో  మరోసారి కుంగినా అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం జరగలేదు. ఈ నెల10న రెడీమిక్స్ వాహనం వెళ్తుండగా ఒక్కసారిగా నాలా కుంగడంతో అందులో పడిపోయింది. 20 రోజుల తర్వాత తాజాగా నాలా కుంగింది.