- వైడెనింగ్ చేయలె.. పూడిక తీయలె.. 5 కోట్లు ఖర్చయినయ్
- ఎస్ఎన్డీపీ ఏర్పడి ఏడాదైనా పనులు జీరో
- ఆఫీసు, అధికారులు, స్టాఫ్ శాలరీలకే ఖర్చు
- నాలాల స్టడీ రిపోర్టుపై ఉన్నతాధికారులు అసంతృప్తి
- వింగ్ అధికారుల తీరుపై సీఎస్ ఆగ్రహం
- బల్దియా పరిధిలో మొత్తం నాలాలు - 173
- వాటి పొడవు - 391 కిలోమీటర్లు
హైదరాబాద్, వెలుగు: సిటీలో వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నాలాల వైడెనింగ్(విస్తరణ), వాటిలో పూడికతీతకు సంబంధించి పనులు చేసేందుకు ప్రత్యేకంగా ఎస్ఎన్డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్‌ప్లాన్) ఏర్పాటైంది. ఏడాది దాటినా ఇప్పటివరకు ఎలాంటి పనులు చేయలేదు. దీని నిర్వహణకు 43 మంది అధికారులు ఉండగా, 13 నెలల్లో శాలరీల కింద రూ.4 కోట్లకుపైనే చెల్లించారు. చేసిన పనులు మాత్రం జీరోనే. ఈ వింగ్‌లో సీఈ నుంచి డీఈల వరకు వినియోగించే 18 వెహికల్స్‌కు నెలకి 6 లక్షల10 వేలు చెల్లిస్తుండగా, మొత్తంగా 80 లక్షలు ఖర్చు చేశారు. ఆఫీసు రినోవేషన్‌కు దాదాపు రూ.10 లక్షలు వదిలాయి. ఇలా మొత్తంగా చూస్తే రూ.5 కోట్లకుపైగా పబ్లిక్ఫండ్ను ఖర్చు చేశారు. ఇంతైనా ఏ పని కూడా ఎస్ఎన్డీపీ అధికారులు సరిగా చేయలేదు. సిటీలోని నాలాలపై స్టడీ చేసిన అధికారులు మొత్తం 15 ప్యాకేజిల్లో 49 పనులు చేపట్టేందుకు రూ.627 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. నాలాల విస్తరణకు సంబంధించి ఎస్ఎన్డీపీ రూపొందించిన డీపీఆర్తప్పుల తడకగా ఉండడంపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంత్రి కేటీఆర్ మీటింగ్‌లు పెట్టినా..
నాలాల వైడెనింగ్చేస్తే ఎన్ని ఆస్తులు సేకరించాలని, వాటికి అయ్యే ఖర్చు, మంచినీటి పైపులైన్లు, విద్యుత్ తీగలు, కేబుల్స్తదితర లెక్కలు లేకుండానే డీపీఆర్రూపొందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నాలాల అభివృద్ధిపై ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు మీటింగ్‌లు నిర్వహించినా ఎలాంటి ఫలితం లేదు. ఏ ఒక్క నాలా పనులు మొదలు పెట్టలేదు. ఏడాదైనా యాక్షన్ ప్లాన్పూర్తికాకపోవడంతో సీఎస్సోమేశ్ కుమార్ రంగంలోకి దిగి వరుస మీటింగ్‌లు నిర్వహిస్తూ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జూన్‌లోపు నాలా వైడెనింగ్ పనులు పూర్తి చేయాలని ఆయన హెచ్చరించారు.
ముంపు ప్రాంతాల్లో స్టడీ చేసినా..
గతేడాది భారీ వానల తర్వాత ఎస్ఎన్డీపీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో నాలాల సమస్యలకు చెక్ పెట్టాలని, వరద ముంపు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఒక ప్రాజెక్టు వింగ్ ఏర్పాటు చేసి అధికారులను కేటాయించింది. లాస్ట్ఇయర్ భారీ వర్షాల కారణంగా ఎక్కడెక్కడైతే ముంపు సమస్య వచ్చిందో జూన్‌లో ఆయా చోట్ల స్టడీ చేసిన అధికారులు అసంపూర్తి రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేశారు. దీన్ని పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి స్డడీ చేసి క్లియర్‌గా రిపోర్టు ఇవ్వాలని కూడా ఆదేశించారు. దీని కారణంగా పనులు కొన్నాళ్లు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు పలు పనులకు సంబంధించి కొద్దిరోజుల్లో టెండర్లు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నా స్పీడప్ చేసినట్టు లేదు.
నాలాల వ్యవస్థపై పట్టులేకనే..
ఎస్ఎన్డీపీ వింగ్‌లో చీఫ్ ఇంజనీర్ తో పాటు ఇద్దరు సీఈలు , నలుగురు ఈఈలు, 11 మంది డీఈలు , 25 మంది ఏఈలతో పాటు ఆపరేటర్లు, స్టాఫ్ ఉన్నారు. ఎస్ఎన్డీపీ ఆఫీసు బుద్ధ భవన్లో ఉంది. ఈ వింగ్‌లోని ఆఫీసర్లలో కొందరు ఇతర డిపార్టుమెంట్లలో పనిచేసిన వారు ఉండగా వారికి నాలాల వ్యవస్థపై పట్టు లేదు. తద్వారా పనుల లేటుకు ఓ కారణంగా ఉంది. ప్రాజెక్ట్‌కు సంబంధించి రూపొందించిన డీపీఆర్ కూడా సమగ్రంగా లేదు.
ఈసారైనా పూర్తి చేస్తరా..
నాలాల వైడెనింగ్పనులు చేస్తున్నామని చెబుతుండగా, లాస్ట్ఇయర్ నుంచి నాలాల పూడికతీత సైతం నామమాత్రంగానే తీస్తున్నారు. నిర్మాణ పనులు మొదలు పెట్టనేలేదు. నాలాలను పట్టించుకోకపోవడంతో రోజురోజుకు సమస్య తీవ్రమైతుంది. నాలాల అభివృద్ధిపై ప్రస్తుతం సీఎస్‌సోమేశ్‌కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టడంపై, ఈసారైనా పూర్తి చేస్తరా లేదోననే డౌట్జనాల్లో వ్యక్తమవుతుంది. వచ్చే ఏడాది జూన్ లోపు నాలాల పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించిన సీఎస్, ఎక్కడైనా ఆస్తుల సేకరణకి సంబంధించి ఇబ్బందులు ఉంటే పోలీసుల సాయం తీసుకోవాలని అధికారులు సూచించారు.
బల్దియా పనులు చేస్తదా..?
సిటీలో ఇకముందు వరదలు వస్తే ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని మున్సిపల్ మంత్రి కేటీఆర్ జనానికి పలుమార్లు హామీ ఇచ్చారు. నాలాల అభివృద్ధికి ఫండ్స్ మాత్రం కేటాయించడంలేదు. ఇప్పుడు కూడా హడావిడి చేస్తున్నా నిధులను జీహెచ్ఎంసీనే ఖర్చు చేస్తుంది. ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పుల పాలైన బల్దియాకు మళ్లీ భారం మోపగా పనులు త్వరగా జరుగతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సపరేట్గా నిధులు ఇవ్వాలని ఎక్స్ పర్ట్స్కోరుతున్నారు.
పనులు మొదలు పెడ్తం
ఇప్పటికే 31 పనులకు సంబంధించి టెండర్లు పిలిచాం. టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలుపెడ్తం. మొత్తం రూ.627 కోట్లతో ఈనెలలో పనులు ప్రారంభిస్తం.
- వసంత, ఎస్ఎన్డీపీ చీఫ్ ఇంజనీర్