- రాత్రికి రాత్రే మట్టితో నింపేసిన అధికార పార్టీ లీడర్
- నాలాను పరిశీలించిన మున్సిపల్ ఆఫీసర్లు
సూర్యాపేట, వెలుగు : కొందరు వ్యక్తులు ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు. చెరువులు, వాగులు, శిఖం, ప్రభుత్వ భూములే కాకుండా నాలాలు సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. తాజాగా సూర్యాపేట పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రధాన నాలాను ఓ అధికార పార్టీ లీడర్ రాత్రికి రాత్రే ఆక్రమించి మట్టితో నింపేశాడు. పట్టణంలోని విజయవాడ – హైదరాబాద్ హైవేను ఆనుకొని నాలా ఉంది. అంబేద్కర్‌నగర్, చింతల చెరువు, చర్చి కాంపౌండ్, గోపాలపురం, జమ్మిగడ్డ మీదుగా వచ్చే నీరు ఈ నాలా ద్వారా పుల్లారెడ్డి చెరువులో కలుస్తుంది. 35 ఫీట్ల వెడల్పు ఉన్న ఈ నాలా వర్షాకాలంలో చిన్నపాటి వాగునే తలపిస్తుంది.
హైవేకు ఆనుకునే ఉండడంతో ఈ ప్రాంతంలో గజం భూమి రూ.40 వేలు పలుకుతోంది. దీంతో పట్టణానికి చెందిన ఓ లీడర్ ఈ నాలాను రాత్రికి రాత్రే ఆక్రమించి మట్టితో నింపి చదును చేశాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఈఈ జీకేడీ.ప్రసాద్, డీఈ సత్యారావు, ఏఈ రాజురెడ్డి ఆదివారం నాలాను పరిశీలించారు. ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నాలా పూడ్చడం వల్ల వర్షాకాలంలో కాలనీలు నీటి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, మట్టిని తొలగించి కబ్జాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.