మదర్​ డెయిరీ పాలకవర్గం రద్దు

  • కో ఆపరేటివ్​ రూల్స్​ ఉల్లంఘించినందుకే.. 
  •     సెప్టెంబర్ లో డైరెక్టర్​ స్థానాలకు ఎన్నికలు జరపకుండా వాయిదా వేసిన బోర్డు
  •     విచారణలో నిబంధనలు బ్రేక్​చేశారని నిర్ధారించిన అధికారులు   
  •     పదవులు కోల్పోయిన చైర్మన్​, డైరెక్టర్లు 

యాదాద్రి, వెలుగు : నల్గొండ–-రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహకార సంఘం పాలక వర్గాన్ని రద్దు చేస్తూ శనివారం రంగారెడ్డి డీసీవో ఎన్. ధాత్రి దేవి ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్​లో డైరెక్టర్ల ఎన్నికలు నిర్వహించకుండా పాలకవర్గం ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ పలువురు పాల ఉత్పత్తి దారుల సంఘాల అధ్యక్షులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నం సీనియర్​ఇన్​స్పెక్టర్​ఎన్.సరస్వతి విచారణ జరిపారు. ఎంక్వైరీలో వారి నిర్ణయం చట్ట విరుద్ధమని నిర్ధారించిన అధికారులు మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేశారు. దీంతో డెయిరీ చైర్మన్​సహా డైరెక్టర్ల పదవులు కోల్పోవాల్సి వచ్చిం ది. 

జరిగింది ఇది..

కో ఆపరేటివ్​యాక్ట్​ ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబర్​30లోగా జనరల్​బాడీ మీటింగ్​పెట్టాలి. రొటేషన్​ సిస్టమ్​లో డైరెక్టర్ల ఎన్నికలు జరపాలి. అదే విధంగా ఆడిట్​ రిపోర్ట్​ఆమోదం పొందాలి. అంతేగాక మూడేండ్ల పాటు పాలకమండలిలోని 15 మంది  డైరెక్టర్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఒకవేళ ఎన్నికలు ఆపితే బలమైన కారణాలు చూపాల్సి ఉంటుంది. అది కూడా కో ఆపరేటివ్​ కమిషనర్​అనుమతి తీసుకున్నాకే వాయిదా వేయాలి. కానీ, సరైన కారణాలు చూపకుండా బోర్డులోని 15 మంది డైరెక్టర్లు ఏకపక్షంగా తీర్మానం చేసి ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా ఆపేశారు.

సెప్టెంబర్ 30న మూడు డైరెక్టర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఒకటి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా పోస్టు రిజర్వు కేటగిరీలో ఉన్నందున మిగిలిన రెండు పోస్టుల కోసం నకిరేకల్​మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత భర్త డీసీసీబీ చైర్మన్​మహేందర్​ రెడ్డి పోటీ పడ్డారు.

ఎక్కువ సొసైటీలు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నందున రెండు డైరెక్టర్ల స్థానాలు తనకే కావాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే వర్గం పట్టుబట్టింది. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున రెండు పోస్టులకు ఆలేరు అభ్యర్థులకే ఇస్తే రాజకీయ ప్రయోజనం కలుగుతుందని అప్పటి ఎమ్మెల్యే భావించారు. కానీ, నకిరేకల్ ​మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గం కూడా డైరెక్టర్​పదవి కోసం పోటీ పడింది. 

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్​రెడ్డిని డైరెక్టర్​గా ఎంపిక చేయాలని  చిరుమర్తి ప్రయత్నించారు. దీని వల్ల రాజకీయంగా అసెంబ్లీ ఎన్నికల్లో చిట్యాల మండలంలో తనకు కలిస్తొందనుకున్నారు. మధ్యలో ఆలేరు ప్రస్తుత ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన వర్గానికి డైరెక్టర్​పదవి కోసం గట్టిగానే ఫైట్​ చేశారు. సునీత మీదున్న వ్యతిరేకత తనకు కలిసొస్తుందని, తద్వారా ఎన్నికలు జరిగితే తన క్యాండిడేట్​ డైరెక్టర్​గా ఎన్నికయ్యే అవకాశం ఉంటుదని అనుకున్నారు. కానీ, అప్పుడు జరిగిన జనరల్​ బాడీ మీటింగ్​లో పెద్ద గొడవ జరిగింది. ఎన్నికలు నిర్వహించాలంటూ సొసైటీ అధ్యక్షులు ఆందోళన చేయగా, బోర్డు డైరెక్టర్లు 15 మంది మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులు సానుకూలంగా లేవని ఏకగ్రీవ తీర్మానం చేసి వాయిదా వేశారు.

మళ్లీ తెరపైకి మాజీ చైర్మన్​ జితేందర్​ రెడ్డి? 

డెయిరీ పాలకవర్గం రద్దు కావడంతో మళ్లీ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తమ్ముడు గుత్తా జితేందర్​ రెడ్డి గతంలో తన చైర్మన్ పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్​ నుంచి బీఆర్ఎస్​లో చేరారు. కానీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జితేందర్​రెడ్డికి మరోసారి చైర్మన్​అయ్యే అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డిని చైర్మన్  చేశారు.

ఆయనపైనా ఆరోపణలు రావడంతో ఏడాదిలోనే పదవి నుంచి దింపేశారు. తర్వాత  జరిగిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సునీత భర్త మహేందర్​ రెడ్డి తన వర్గానికి చెందిన శ్రీకర్​రెడ్డిని చైర్మన్​చేశారు. గత సెప్టెంబర్​తో ఆయన ఏడాది పూర్తి చేసుకున్నారు. డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు పెట్టకపోవడంతో ఇప్పు డు శ్రీకర్​రెడ్డి పాలకవర్గం రద్దయ్యింది. అయితే, జితేందర్​రెడ్డి వర్గం అసెంబ్లీ ఎన్నికల్లో చిట్యాల మండలంలో ఎమ్మెల్యే వేముల వీరేశానికి సపో ర్ట్​చేసింది.

దీంతో ఇప్పుడు మళ్లీ డెయిరీ ఎన్నికలు గుత్తా ఫ్యామిలీ చుట్టూ తిరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరోక్షంగా కాంగ్రెస్​కు సాయపడడంతో మళ్లీ జితేందర్​ రెడ్డిని చైర్మన్​గా చేస్తారా లేదంటే రాజకీయం గా ఎలాంటి మార్పులు జరుగుతాయనే దాని పై ఆసక్తికర చర్చ నడుస్తోంది.