యాదాద్రి, వెలుగు: పంచాయతీ రాజ్ ఏఈ.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కాంట్రాక్టర్ శ్రీశైలం ఆలేరు మండలం శారాజీపేటలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించాడు. ఈ పనులకు సంబంధించి రూ. 16 లక్షల బిల్లు కాంట్రాక్టర్‌కు రావాల్సి ఉంది. ఈ మేరకు కాంట్రాక్టర్ పలుమార్లు పంచాయతీ రాజ్ ఏఈ కే రమేశ్‌కుమార్‌ను కలిశాడు. అయితే 5 శాతం కమీషన్ రూ. 80 వేలు ఇస్తేనే బిల్లు ఇస్తానని ఏఈ స్పష్టం చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ ఆఫీసర్లను కలిసి విషయం వివరించాడు.
వారి సలహా మేరకు ఆలేరు ఎంపీడీవో ఆఫీసులో శనివారం ఏఈ రమేశ్‌కుమార్‌కు రూ. 80 వేలు ఇచ్చాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఆఫీసు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఏఈ తన కారు డోరు తీస్తుండగా నల్గొండ ఏసీబీ డీఎస్పీ ఎంవీ శ్రీనివాసరావు నేతృత్వంలోని సిబ్బంది ఆయనను చుట్టుముట్టారు. ఏఈ నుంచి నగదును స్వాధీనం చేసుకొని టెస్ట్‌చేసి లంచంగా ఇచ్చిందేనని గుర్తించారు. అనంతరం ఏఈ రమేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని 4 గంటల పాటు విచారించారు.
ఇదే సమయంలోనే తార్నాకలోని రమేశ్‌కుమార్ ఇంటిపై ఏసీబీ ఆఫీసర్లు దాడులు నిర్వహించారు. అనంతరం ఆలేరు ఎంపీడీవో జ్ఞాన ప్రకాశ్‌రావు, శారాజీపేట పంచాయతీ సెక్రటరీ స్వప్న సమక్షంలో కాంట్రాక్టర్ నిర్వహించిన వర్క్స్ గురించి తెలుసుకున్నారు. రమేశ్‌కుమార్‌ను విచారించినఅనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.