- కలిసి రానీ లీడర్లతో జిల్లా నేతల తంటాలు
- అధికారంలో ఉన్నప్పుడు హల్చల్చేసిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, లీడర్లు
- ప్రస్తుతం ఎంపీ ఎన్నికల ప్రచారానికి దూరం
నల్గొండ, వెలుగు : నల్గొండ, భువనగిరి పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్కుఎదురీత తప్పేలా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు హంగామా చేసిన లీడర్లంతా పార్టీకి మెల్లగా దూరమవుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో రెండుచోట్ల కొత్త అభ్యర్థులను బరిలో దింపిన హైకమాండ్.. అగ్నిపరీక్ష ఎదుర్కొంటోంది. కరువు పరిస్థితులే ఎంపీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారుతాయని, దానిపైనే ఫోకస్పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచిన వారంతా ఎంపీ ఎన్నికల్లో బాహాటంగానే ప్రతీకార చర్యలకు పూనుకుంటున్నారు. ఎంపీ టికెట్ ఇవ్వలేదని కొందరు, పవర్లో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని మరికొంత మంది లీడర్లు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఒంటిరిగానే పోరాడుతున్నారు.
మచ్చుకైనా కనిపించని లీడర్లు..
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి తోడుగా ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు మినహా ఆశించిన స్థాయిలో పార్టీ క్యాడర్ పాల్గొనడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్చైర్మన్లు, ఎమ్మెల్సీ పదవుల కోసం ఎగబడిన వారెవరూ ఇప్పుడు కనిపించడం లేదు. తెలంగాణ ఉ ద్యమంలో కీలక పాత్ర పోషించిన లీడర్లను, ఎమ్మెల్యే టికెట్ఆశించినవారిని సైతం పక్కన పెట్టి హైకమాండ్.. కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేని వాళ్లకు పదవులు కట్టబెట్టింది.
అంతేకాకుండా అప్పటి ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు వాళ్లు ప్రతిపాదించిన చోటా.. మోటా లీడర్లనే అందలం ఎక్కించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కుల సమీకరణాలు కలిసివస్తాయని భావించి పలుచోట్ల ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే రాష్ట్ర స్థాయి పదవుల్లో పెద్దపీట వేసింది. అలాంటి నేత లెవ్వరూ ఎంపీ ఎన్నికల్లో సప్పుడు చేయడం లేదు. కనీసం మీటింగ్‌లకు కూడా వెళ్లడం లేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.
పవర్లో ఉన్నప్పుడు పబ్లిసిటీ పైనే ఫోకస్..
ప్రస్తుతం మాజీలైన లీడర్లు పవర్లో ఉన్నప్పుడు పబ్లిసిటీ కోసం తెగ ఆరాటపడ్డారు. ముఖ్యంగా ఉప ఎన్నికలప్పుడు ఇన్చార్జిలు సొంతంగా వచ్చి పార్టీ గెలుపు కోసం పనిచేశారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్అయ్యింది. పవర్పోగానే ఒక్కొక్కరూ మెల్లగా పక్కకు జారుకుంటున్నారు. అంతేగాక సొంత పార్టీ ముఖ్య నేతలనే టార్గెట్ చేస్తూ సెటెర్లు వేస్తున్నారు.
ఇటీవల నాగార్జునసాగర్ నియోజ కవర్గంలో పెద్దవూర, హాలియా, గుర్రంపోడు మండలాలకు చెందిన ఎంపీపీ, జడ్పీటీసీలు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. ఈ జాబితాలో జడ్పీ వైస్చైర్మన్ఇరిగి పెద్దులు కూడా ఉన్నారు. త్వరలో ఇదే నియోజకవర్గానికి చెందిన మరో ముఖ్య నేత కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. సాగర్ఉపఎన్నికల్లో కీలకమైన రెండు పదవులు పొందిన నేతలు సైతం కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇదిలావుంటే నల్గొండ నియోజకవర్గంలో పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. ఇక్కడున్న సీనియర్లు జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి లాంటి వాళ్లు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
ప్రచారంపై హైకమాండ్ ఆరా..
ఎన్నికల ప్రచార సభలు ఎట్లా సాగుతున్నాయి? ప్రజల నుంచి స్పందన ఏ విధం గా ఉంటుంది? అనే అంశాలపై పార్టీ హైకమాండ్ఆరా తీస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో జరిగిన ప్రచార కార్యక్రమాల ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని పరిశీలిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఎమ్మెల్సీలు ఎవరెవరు వస్తున్నారు? పార్టీ వెన్నంటే ఉండి కోవర్టులుగా పనిచేస్తున్న వారి వివరాలను సైతం రాబడుతున్నారు.
గండం గట్టెక్కేదెట్లా..?
ఎంపీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. బీజేపీ పూర్తిస్థాయిలో కార్యాచరణ మొదలు పెట్టలేదు. నామినేషన్ల హడావుడి షురూ కాకముందే ఒక దఫా ఎన్నికల ప్రచారం ముగించాలని బీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశించింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనల్లో కరువుపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కానీ, ఆ తర్వాత పార్టీ క్యాడర్మెత్తపడింది. కరువు పరిస్థితులు, కాంగ్రెస్ స్కీంలపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కేసీఆర్ ఆదేశించినా పార్టీ క్యాడర్లో మాత్రం కదలికలేదు.