- నల్గొండ కంటే భువనగిరి సాధించే మెజార్టీ పైనే దృష్టి
- మూడు లక్షలు టార్గెట్ పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
- నాలుగు లక్షలతో గెలిపిస్తామన్న కోమటిరెడ్డి బ్రదర్స్
- దేశంలో నల్గొండ ఎంపీ సెగ్మెంట్ అత్యధిక మెజార్టీ సాధిస్తుందన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నల్గొండ, వెలుగు : నల్గొండ, భువనగిరి పార్లమెంట్స్థానాలు కాంగ్రెస్ అగ్ర నేతలకు సవాల్‌గా మారాయి. ఇక్కడ పార్టీల మధ్య జరుగుతున్న పోటీ కంటే నల్గొండ వర్సెస్భువనగిరి మధ్య జరుగుతున్న పోటీగానే కాంగ్రెస్ భావిస్తోంది. ఇద్దరు జిల్లా మంత్రులు, ఇన్చార్జి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధిస్తామని శపథం చేయడం ఆసక్తికరంగా మారింది.
రెండుచోట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్అభ్యర్థులను గెలిపించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తామని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఇన్చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరిలో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి సభలో మెజార్టీ పైనే సవాళ్లు, ప్రతి సవాళ్లు విసిరారు.
రెండుచోట్ల బీఆర్ఎస్, బీజేపీ పోటీనే కాదని, నల్గొండ కాంగ్రెస్, భువనగిరి కాంగ్రెస్మధ్య జరుగుతున్న యుద్ధమని ఇన్చార్జి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి నాలుగు లక్షల మెజార్టీ సాధించాలని, ఆ బాధ్యత తమ్ముడు రాజగోపాల్రెడ్డిపైనే ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా జిల్లా అగ్రనేతలు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్ ఇన్చార్జి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేశంలోనే నల్గొండ సెగ్మెంట్లో భారీ మెజార్టీ సాధిస్తామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో నల్గొండ ఎంపీ సెగ్మెంట్దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదే స్పీడ్‌తో మెజార్టీ కూడా సాధించి తీరుతామని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కసితో పనిచేస్తున్నారు.
రావి నారాయణరెడ్డి రికార్డు బ్రేక్ చేస్తారా..?
కాంగ్రెస్అగ్రనేతల పోటీ చూస్తుంటే దివంగత ఎంపీ రావి నారాయణరెడ్డికి వచ్చిన రికార్డు మెజార్టీని బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ల పరిధిలోని 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించారు. దీంతో ఎంపీ ఎన్నికల్లో నాలుగు లక్షల మెజార్టీ వస్తదనే ధీమాతో ఉన్నారు.
1952లో సార్వత్రిక ఎన్నికల్లో రావి నారాయణరెడ్డికి 2,72,280 మెజార్టీ వచ్చింది. ఈయన భువనగిరి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో దేశంలో నెహ్రూకు వచ్చిన మెజార్టీ కంటే రావి నారాయణకు వచ్చిన మెజార్టే ఎక్కువ. ఆ తర్వాత మళ్లీ 2009లో నల్గొండ ఎంపీ సెగ్మెంట్లో గుత్తా సుఖేందర్‌రెడ్డికి 1,52,982 ఓట్ల మెజార్టీ రాగా, 2014 లో 1,93,156 ఓట్ల మెజార్టీ వచ్చింది.
మెజార్టీతో లాభమేంది..?
రెండు ఎంపీ సీట్లను కాంగ్రెస్ సీనియర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండుచోట్ల సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు కావడం ఒక ఎతైతే, సీఎంతో జిల్లా నేతలకు ఉన్న విభేదాలు కూడా ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాయి. అందరూ ఐక్యంగా కాంగ్రెస్అభ్యర్థుల గెలుపుపైనే దృష్టి పెట్టారు. పీసీసీ మాజీ చీఫ్, ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డినల్గొండ ఎంపీ సెగ్మెంట్‌ను చాలెంజ్ గా తీసుకుని నియోజకవర్గ మీటింగ్‌లు పెడుతున్నారు. ఇక భువనగిరి ఇన్చార్జి రాజగోపాల్‌రెడ్డి అన్నీతానై కాంగ్రెస్అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
నల్గొండకు మించి భువనగిరి అభ్యర్థి 3 లక్షల మెజార్టీ సాధిస్తే యాదాద్రి టెంపుల్ పేరును మళ్లీ యాదిరిగుట్టగా మారుస్తానని, మూసీ ప్రక్షాళన చేస్తామని, గంధమల్ల, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు పూర్తిచేస్తామని సీఎం రేవంత్హామీ ఇచ్చారు. అంతేకాకుండా నల్గొండలో ఫ్లోరైడ్మహమ్మారిని నిర్మూలించేందుకు శ్రీశైలం సొరంగ మార్గం పనులు వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తామన్నారు. భువనగిరి సెగ్మెంట్లో మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరిలో కాంగ్రెస్‌కు బంపర్మెజార్టీ సాధించి తీరుతామని కాంగ్రెస్ఎమ్మెల్యేలు ధీమాతో ఉన్నారు.