మదర్ డెయిరీలో ఎన్నికల సైరన్​

  • ఆరు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్   
  • ఈనెల 27 నుంచి నామినేషన్ల స్వీకరణ
  • చైర్మన్ శ్రీకర్​రెడ్డితో సహా ఐదుగురు డైరెక్టర్ల పదవీకాలం వచ్చే నెలాఖరుతో పూర్తి
  • హైకోర్టు, ట్రిబ్యునల్​కేసులు తేలకుండానే ఎన్నికలు
  • తెరపైకి మళ్లీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్​రెడ్డి, గంగుల కృష్ణారెడ్డి 

నల్గొండ, వెలుగు : నల్గొండ, రంగారెడ్డి పాలఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘంలో డైరెక్టర్ల ఎన్నికలకు నోటిఫికేషన్​ జారీ అయ్యింది. ఈనెల 19న ఎన్నికల ఆఫీసర్ ​వెంకటరెడ్డి షెడ్యూల్ ప్రకటించారు. గతేడాది ఖాళీ అయిన మూడు డైరెక్టర్ల స్థానాలకు సెప్టెంబర్ నెలాఖరున ఖాళీకానున్న మరో మూడు డైరెక్టర్ల స్థానాలకు కలిపి ఈనెల 27నుంచి సెప్టెంబర్​4 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 5న నామినేషన్లు పరిశీలన, 6న ఉపసంహరణ గడువు విధించారు. అదే రోజు ఫైనల్​అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఒకవేళ పోటీలో ఎవరూ లేకుంటే డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.

ఎన్నికలు అనివార్యమైతే 13న నిర్వహిస్తారు. మొత్తం ఆరుగురు డైరెక్టర్​స్థానాల్లో రెండు రంగారెడ్డి జిల్లా జనరల్ కోటా కింద రిజర్వు చేయగా, మరో నాలుగు స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయి. డెయిరీ పాలకవర్గంలో 15 మంది డైరెక్టర్లు ఉండగా, వచ్చే నెల 30న చైర్మన్ శ్రీకర్​రెడ్డితో సహా ఇద్దరు డైరెక్టర్ల పదవీకాలం ముగుస్తుంది. గతేడాది సెప్టెంబర్​లో ముగ్గురు డైరెక్టర్ల పదవీ కాలం పూర్తియినప్పటికీ హైకోర్టు, ట్రిబ్యునల్​లో కేసు నడుస్తుండడంతో ఎన్నికలు నిర్వహించలేదు. అయితే ఇప్పటికీ కూడా పాత కేసులకు సంబంధించి కోర్టుల నుంచి ఎలాంటి క్లియరెన్స్​రాకముందే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆరుగురు డైరెక్టర్లు పదవి నుంచి దిగిపోతే పాలకవర్గంలో మిగిలేది 9 మంది మాత్రమే. నార్మాక్స్​చట్టం ప్రకారం పాలకవర్గం నడవాలంటే 10 మంది సభ్యులు కచ్చితంగా ఉండాలి. కాబట్టి కోర్టులో కేసులు ఉన్నప్పటికీ వాటిని పక్కకు పెట్టేసి ఎన్నికలు నిర్వహణకు బోర్డు తీర్మానించింది. 

కాంగ్రెస్​ గూటికి చేరి ఒక్కటయ్యారు..

ఇప్పటివరకు డెయిరీ పాలకవర్గం బీఆర్ఎస్​ చేతిలోనే ఉంది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత వర్గానికి చెందిన శ్రీకర్ రెడ్డి రెండేళ్ల నుంచి చైర్మన్​పదవిలో ఉన్నారు. మెజార్టీ డైరెక్టర్లు బీఆర్ఎస్​నుంచి గెలిచిన వాళ్లే. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత పలువురు డైరెక్టర్లు కాంగ్రెస్​లో చేరారు. మాజీ చైర్మన్లు గుత్తా జితేందర్​రెడ్డి, గంగుల కృష్ణారెడ్డితో సహా ఇంకొంతమంది కాంగ్రెస్​లో చేరారు. ఇప్పుడు పదవి కాలం పూర్తిచేసుకుంటున్న డైరెక్టర్లలో కూడా కొందరు కాంగ్రెస్​లో చేరారు.

దీంతో గతంలో డెయిరీ చైర్మన్​ను దించేందుకు అప్పటి బీఆర్ఎస్​లో తీవ్రంగా ప్రయత్నించినా వ్యతిరేకవర్గం సైతం ఇప్పుడు కాంగ్రెస్​లో చేర డంతో అందరూ ఒక్కటయ్యారు. కాబట్టి గతేడాది సెప్టెంబర్​లో ఎన్నికలు జరగకుండా కోర్టులో కేసు దాఖలు చేసిన సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు కాంగ్రెస్​లో చేరడంతో త్వరలో డెయిరీ పాలకవర్గం కూడా కాంగ్రెస్​ఖాతాలోనే చేరనుంది.  

కోర్టులో స్టే ఉండగానే..

గతేడాది సెప్టెంబర్​లో డైరెక్టర్ల ఎన్నికలు పెట్టకుండా పాలకవర్గం తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు పాల ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులపై రంగారెడ్డి జిల్లా డీసీవో దాత్రికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 12 గంటల్లోనే డీసీవో పాలకవర్గం మొత్తాన్ని రద్దు చేశారు. దీనిపై ఇరువర్గాలు హైకోర్టు, ట్రిబ్యునల్​లో కేసులు వేశాయి. ఈ కేసులకు సంబంధించి ఎలాంటి తీర్పు రాలేదు. ఇదిలావుండగానే మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్​లో అవే మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు పెట్టేందుకు బోర్డు తీర్మానించింది.

ఈ మేరకు ఎన్నికల ఆఫీసర్​గా వెంకటరెడ్డిని నియమించడంతో డీసీవో దాత్రి సీరియస్ అయ్యారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఎన్నికల షెడ్యూల్​ఎలా ప్రకటిస్తారని వెంటనే​రద్దు చేయాలని ఆదేశించారు. డీసీవో ఇచ్చిన ఆదేశాలపై మళ్లీ బోర్డు సభ్యులు హైకోర్టులో కేసు వేశారు. ఇవన్నీ ఉండగానే మళ్లీ వెంకటరెడ్డినే ఎన్నికల ఆఫీసర్​గా నియమించి, కొత్తగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడంతో మదర్​డెయిరీలో గందరగోళం నెలకొంది.

అప్పుడు ఎన్నికల ఆఫీసర్​గా ఉన్న హనుమంతురావును తప్పించడమేగాక, డీసీవో దాత్రి రెండు రోజుల క్రితం బదిలీ అయ్యారు. దీన్నే అదునుగా భావించిన డెయిరీ పాలకవర్గం ఎన్నికలు పెడ్తున్న సంగతిని బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు పాటించింది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని డీసీవో ఆఫీసులకు పంపాల్సి ఉంది. కానీ నోటిఫికేషన్ ప్రతులు కేవలం డెయిరీ చైర్మన్, పాలశీతలీకరణ కేంద్రాలకు మాత్రమే పరిమితం చేసింది.

చైర్మన్​ రేసులో మాజీ చైర్మన్లు..

డెయిరీ చైర్మన్​ రేసులో మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి తమ్ముడు గుత్తా జితేందర్​రెడ్డి, నకిరేకల్​ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గానికి చెందిన గంగుల కృష్ణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు జలేందర్​ రెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్​లో చేరిన వీరంతా చైర్మన్​పదవి కోసం పోటీపడడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.