మస్త్​ ఉపాధి .. కోటి 47 లక్షల పని దినాలు

మస్త్​ ఉపాధి .. కోటి 47 లక్షల పని దినాలు

నల్గొండ, వెలుగు:  రానున్న ఆర్థిక సంవత్సరానికి ఉపాధి పని దినాల లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది.   నల్గొండ, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 2025–26లో 1,47,39,180 పని దినాల టార్గెట్ పూర్తి  చేసేందుకు  ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు.  నల్గొండ జిల్లాలో 82,22,218 , సూర్యాపేట జిల్లాలో 65,17,562 పని దినాలు కల్పించానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్‌‌‌‌‌‌‌‌యార్డు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల పెంపకం,  షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. 

6,22,400 జాబ్ కార్డులు

నల్గొండ జిల్లాలో 3,59,768 జాబ్ కార్డులు జారీ చేయగా ఇందులో 7,64,390 మంది కూలీల సంఖ్య నమోదైంది. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో 82,22,218 పని దినాలు లక్ష్యంగా పెట్టుకోగా 63,88,894 పని దినాలతో రూ.194 కోట్లు ఖర్చు చేశారు. సూర్యాపేట జిల్లాలో 2,62,632  జాబ్ కార్డులు ఉండగా 5,70, 256 మంది కూలీల సంఖ్య నమోదై ఉంది. మొత్తం 65,17,562 పని దినాల లక్ష్యంలో 51,12,894 పని దినాలలో రూ.154 కోట్లు ఖర్చు చేశారు. పని దినాల వినియోగంలో సూర్యాపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 

2025–26 -ప్రణాళిక సిద్ధం

నల్గొండ జిల్లాలో 2025 –- 26ఆర్థిక  సంవత్సర టార్గెట్​ ప్రకారం..  రూ.269 కోట్లు, సూర్యాపేట జిల్లాకు  రూ.193 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే మొదటి స్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లాకు 1.20 లక్షల పని దినాలు తగ్గించగ నల్గొండ జిల్లాకు 6.91 లక్షల పని దినాలు ఎక్కువగా కల్పించానున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం  లబ్ధిదారుల ఎంపికలో ఉపాధి జాబ్ కార్డ్ ఉండి కనీసం 20 రోజులు హాజరై ఉండాలన్న రూల్స్ ఉన్నాయి. 

ఈ క్రమంలో ఇప్పటి వరకు జాబ్ కార్డ్ ఉన్న కూడా ఉపాధి పనులకు హాజరు కాలేని కుటుంబాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ది కోసం హాజరయ్యే అవకాశాలు ఉంటాయని ఆఫీసర్లు చెప్తున్నారు.   రూల్స్​ ప్రకారం.. ఎక్కువగా నీటి నిల్వ పనులను చేపట్టాల్సి ఉండగా   ఇంకుడు గుంతలు, పశువుల షెడ్ల నిర్మాణం, నీటి తొట్ల ఏర్పాటు, నర్సరీల ఏర్పాటు, నీటి కుంటల నిర్మాణం, హరితహారం మొక్కలకు కంచెల ఏర్పాటు, మొక్కలకు నీరు పోసే పనులు తదితర గ్రామాభివృద్ధికి అవసరమయ్యే పనులను చేపట్టనున్నారు. 

డెవలప్​మెంట్ వర్క్స్ తో  పెరగనున్న పని దినాలు

జిల్లాలో 2025 -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి కూలీలు పెరిగే అవకాశం ఉండటంతో అందుకు తగినట్లుగా పని దినాలను పెంచడంతో పాటు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను కేటాయించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి అవసరమైన పనులను గుర్తించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, అందుకు అవసరమయ్యే కూలీల సంఖ్య, కేటాయించాల్సిన నిధులు, అవసరమయ్యే పని దినాలు తదిత ర వాటిని అధికారులు ప్రణాళికబద్ధంగా ఖరారు చేశారు.