నల్గొండ బీజేపీలో వర్గపోరు.. జిల్లా అధ్యక్షుడిని మార్చాలంటూ నాయకుల మౌన దీక్ష 

నల్గొండ బీజేపీలో వర్గపోరు.. జిల్లా అధ్యక్షుడిని మార్చాలంటూ నాయకుల మౌన దీక్ష 
  •  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పర్యటన సందర్భంగా పార్టీ ఆఫీస్ ముందు నిరసన 
  • పార్టీ నేతలను బుజ్జగించే పనిలో ముఖ్యనేతలు

నల్గొండ, వెలుగు : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నల్గొండ పర్యటన వేళ జిల్లా బీజేపీలో వర్గపోరు భగ్గుమంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌‌‌‌ నాగం వర్షిత్‌‌‌‌రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండ పార్లమెంట్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ ఆఫీస్‌‌‌‌ వద్ద మౌనదీక్ష నిర్వహించారు. క్రియాశీల సభ్యత్వం లేని వ్యక్తికి రెండోసారి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని నిలదీశారు.  

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వర్గ పోరు ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. వర్షిత్‌‌‌‌రెడ్డి పట్ల మొదటి నుంచి పార్టీలో వ్యతిరేకత నెలకొంది. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ సమావేశాలు నిర్వహించలేదని, సీనియర్లను పట్టించుకోలేదన్న అసంతృప్తి ఉంది. పార్టీలో తనకంటూ ఓ గ్రూప్‌‌‌‌ను ఏర్పాటు చేసుకున్నారని, అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించడం లేదన్న అభిప్రాయం ఉంది.

జిల్లా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవని, వర్షిత్‌‌‌‌రెడ్డికి తిరిగి అవకాశం ఇవ్వొద్దని, కొత్త వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతూ గతంలోనే పలువురు లీడర్లు హైకమాండ్‌‌‌‌కు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా అధిష్ఠానం పట్టించుకోలేదని పలువురు లీడర్లు వాపోతున్నారు. అయితే ఆఫీస్‌‌‌‌లో దీక్ష చేస్తున్న నాయకులను సముదాయించేందుకు ఆ పార్టీ ముఖ్య నేత గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌రెడ్డి ప్రయత్నించగా.. అధ్యక్షుడిని మార్చే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.

వర్షిత్‌‌‌‌రెడ్డిని తొలగించి మరొకరికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అధ్యక్షుడిని మారిస్తేనే  పార్టీలో కొనసాగుతామని, లేదంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని స్పష్టం చేశారు. మౌనదీక్షలో ఎస్సీ సెల్‌‌‌‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి పోతేపాక సాంబయ్య, నాయకులు దానం భూపాల్, పెరిక మునికుమార్ పాల్గొన్నారు.