- నల్గొంఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ లీడర్ల ద్వంద్వ వైఖరిడ
- కృష్ణపట్టె మొత్తాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు కట్టబెట్టిన బీఆర్‌ఎస్ సర్కార్
- వందల ఎకరాల అటవీ, ప్రభుత్వ, భూదాన్ భూములు ధారాదత్తం
- తొమ్మిదేండ్లలో 20 సార్లు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన వైనం
- స్థానికులపై కేసులు పెట్టించి మరీ పర్మిషన్లు ఇప్పించిన బీఆర్‌ఎస్ లీడర్లు
- ఇప్పుడు రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళనలు
సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిమెంట్ పరిశ్రమల ఏర్పాటుపై బీఆర్‌ఎస్ లీడర్లు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఇబ్బడిముబ్బడిగా పర్మిషన్లు ఇచ్చినా పట్టించుకోని లీడర్లు.. ఇప్పుడు సిమెంట్ పరిశ్రమల వల్ల ప్రజాజీవనానికి ఇబ్బంది అవుతుందంటూ ఆందోళనలకు దిగుతున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఉన్న ఓ కంపెనీ కోసం బీఆర్‌ఎస్ హయాంలో ఏకంగా తొమ్మిది సార్లు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అనుమతులు మంజూరు చేశారు. అదే నేతలు ఇప్పుడు రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటూ, ఆందోళనలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతల ద్వంద్వ వైఖరిపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తొమ్మిదేండ్లలో 20 సార్లు పర్యావరణ అనుమతులు
సిమెంట్ పరిశ్రమల నిర్మాణానికి బీఆర్‌ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అనుమతులు జారీ చేశారు. ఇందుకు స్థానిక బీఆర్‌ఎస్ లీడర్లు, ప్రజాప్రతినిధులు సైతం ముక్తకంఠంతో మద్దతు ఇచ్చారు. సిమెంట్ పరిశ్రమలు బాధితులకు కనీస నష్ట పరిహారం కూడా ఇప్పించకుండా, బాధితులపైనే కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. సిమెంట్ కంపెనీల పేరుతో వందల ఎకరాల ప్రభుత్వ, భూదాన్, అటవీ భూములను దోచుకున్నారు. వెయ్యి ఎకరాల భూమిని సేకరించి కనీసం 100 మందికి కూడా ఉపాధి చూపలేకపోయారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 12 సిమెంట్ కంపెనీలు ఉన్నాయి.
ఇందులో ఎనిమిది సిమెంట్ పరిశ్రమల విస్తరణ కోసం బీఆర్‌ఎస్ హయాంలో 20 సార్లు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. వందల ఎకరాల ప్రభుత్వ, భూదాన్, ఫారెస్ట్ భూముల్లో సైతం మైనింగ్‌కు పర్మిషన్ ఇచ్చారు. మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఓ సిమెంట్ పరిశ్రమ కోసం తొమ్మిదేండ్లలో తొమ్మిదిసార్లు పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఉత్పత్తి, మైనింగ్‌ను 200 రెట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం రామన్నపేటలో ఏర్పాటు అవుతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కంటే రెండింతలు పెద్ద ప్రాజెక్టులకు బీఆర్ఎస్ హయాంలో అనుమతులు జారీ చేపట్టారు. బారీ బందోబస్తు నడుమ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. స్థానిక ప్రజలు ఆందోలనలు చేసినా పట్టించుకోకుండా, వారి అభీష్టానికి వ్యతిరేకంగా కంపెనీలు ఏర్పాటు చేశారు.
స్థానిక సిమెంట్ కంపెనీల ఓనర్ల ప్రోద్భలంతోనే..
జిల్లాలో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు దీటుగా అదానీ సంస్థ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సూర్యాపేట జిల్లా పాలకీడు శివారులో పెన్నా సిమెంట్ కంపెనీని కొనుగోలు చేసిన అదానీ సంస్థ.. ఆ పరిశ్రమను మోడరేట్ చేసే పనిలో పడింది. దీంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సైతం కంపెనీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల రామన్నపేటలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. అయితే అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు అయితే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ బీఆర్‌ఎస్ లీడర్లు ఆందోళన బాట పట్టారు. రామన్నపేటలో సిమెంట్ కంపెనీ ఏర్పాటు కోసం 2022లో బీఆర్‌ఎస్ హయాంలోనే ఆదానీ సంస్థ 300 ఎకరాల స్థలాన్ని సేకరించింది.
అప్పుడు భూముల కొనుగోలుకు సహకరించిన బీఆర్‌ఎస్ లీడర్లు.. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవడంతో పాటు ధర్నాలకు దిగుతున్నారు. అయితే జిల్లాలో ఆదానీ ఎంట్రీని అడ్డుకునేందుకు స్థానిక సిమెంట్ పరిశ్రమల యజమానులే బీఆర్‌ఎస్ లీడర్లను ముందుపెట్టి ఆందోళనలు చేయిస్తున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాడు బీఆర్ఎస్ నేతలు అనుమతులు ఇవ్వకుంటే ఇప్పుడు ఈ పరిస్థితే వచ్చి ఉండేది కాదు కదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.