- ఎన్నికల కోసం దిగొస్తున్న నేతలు
- ఇన్నాళ్లూ నియోజకవర్గాలపై పెత్తనం
- లోకల్ ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి అనుచరులకు కాంట్రాక్టులు
- ఇప్పుడు పైసలు, పదవులు ఇస్తామంటూ లోకల్ లీడర్లకు బుజ్జగింపులు
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే వందల కోట్ల అభివృద్ధి పనులను తన అనుచరులకే కట్టబెట్టాడు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కింద గ్రామాలకు శాంక్షన్అయిన పనులను సైతం సర్పంచులకు ఇవ్వకుండా సొంత కాంట్రాక్టర్లతోనే చేయించాడు. ఇసుక, మట్టి దందాలనూ ఆయన కనుసన్నల్లోనే నడిపించాడు. ఐదేండ్లుగా ఇదే పరిస్థితి ఉంది. తాము లక్షలు పెట్టి గెలిచామని, తమకు చిన్నచిన్న పనులైనా అప్పగించాలని సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు మొత్తుకున్నా ఆ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు రావడంతో సదరు ఎమ్మెల్యే నాలుగు రోజులుగా పల్లె, పట్టణాల బాట పడ్తున్నాడు. ఈసారి ఎన్నికల్లో తనకు సహకరించాలని లోకల్ లీడర్లను కోరుతున్నాడు. కానీ ఆయన తీరుతో ఇప్పటికే విసిగిపోయిన స్థానిక ప్రజాప్రతినిధులు.. ‘‘మేం నిధుల్లేక అరిగోస పడ్తున్నామని చెప్పినా ఇన్నాళ్లూ కనికరించలేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్” అని ఎమ్మెల్యే ముఖం మీదే అడిగేస్తున్నారు. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉండడంతో స్థానిక ప్రజాప్రతినిధులను బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడ్తున్నారు.
ఎన్నికల్లో మద్దతు కోసం..
సీఎం కేసీఆర్ ఇచ్చిన అండతో ఇన్నాళ్లూ నియోజకవర్గాల్లో సుప్రీంలుగా వెలుగొందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్టకేలకు దిగొస్తున్నారు. ‘ఇన్నాళ్లూ ఫండ్స్ మావే.. పనులు మావే’ అంటూ గ్రామాల్లో సర్పంచులను సైతం వేలుపెట్టనీయనివాళ్లు.. ఇప్పుడు అదే సర్పంచుల కోసం ఊళ్ల బాట పడ్తున్నారు. నిజానికి గ్రామాలు, పట్టణాల్లో స్థానిక లీడర్ల హవా ఉంటుంది. ప్రజల కష్టసుఖాల్లో తోడుండే స్థానిక నేతల మాట మీద పార్టీలకు ఓట్లు వేసే వాళ్లకు లెక్కలేదు. సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నా సరే, స్థానిక నేతల మద్దతు లేకుండా గెలవడం కష్టమని ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అందుకే టికెట్లు కన్ఫర్మ్ అయిన వెంటనే పలువురు ఎమ్మెల్యేలు లోకల్ లీడర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. కానీ ‘‘ఇన్నాళ్లూ మమ్మల్ని పట్టించుకోని ఎమ్మెల్యేలు.. ఎన్నికల్లో గెలవాలనే స్వార్థంతోనే ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. ఈసారి మద్దతిచ్చే ప్రసక్తే లేదు” అని కొందరు చెప్తున్నారు. ‘ఇన్నాళ్లూ నష్టపోయింది చాలు.. ఇవ్వాల్సింది ముందు ఇస్తే తప్ప సహకరించే పరిస్థితి లేదు అని ఇంకొందరు మొహం మీదనే చెప్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఈ తరహా ఉదంతాలు సైతం బయటకు వస్తున్నాయి.
బుజ్జగింపులు, బెదిరింపులు..
ఎన్నికల్లో గెలవాలంటే లోకల్ లీడర్ల మద్దతు తప్పనిసరి కావడంతో స్థానిక ప్రజాప్రతినిధు లను ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నారు. ‘‘మళ్లీ గెలిస్తే మీ గ్రామాల్లో, పట్టణాల్లో వేలుపెట్టం. కాం ట్రాక్ట్ పనులు కూడా మీకే వచ్చేలా చూస్తాం” అని హామీ ఇస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఓ మండల ప్రజాప్రతినిధులను బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలిసింది. ‘‘ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత వరుసగా మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత నాదే. కనుక మళ్లీ పదవులు రావాలంటే మాకు సహకరించాల్సిందే” అని హెచ్చరించినట్లు సమాచారం. మొత్తమ్మీద అసంతృప్తితో ఉన్న స్థానిక నేతలను నయానో, భయానో దారిలోకి తెచ్చుకునేందుకు ఎమ్మెల్యేలు.. ఇదే అదనుగా పైసలపైనో, పదవులపైనో హామీలు
తీసుకునేందుకు లీడర్లు ట్రై చేస్తున్నారు.
కూసుకుంట్ల ర్యాలీకి నేతల డుమ్మా..
మళ్లీ టికెట్ దక్కిన ఆనందంలో మును గోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం చౌటుప్పుల్మండలానికి వెళ్లారు. దండు మైసమ్మ టెంపుల్ లో పూజలు చేసి, మునుగోడు వరకు కార్లతో ర్యాలీగా రావాలని భావించారు. నియోజక వర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులందరికీ ఆహ్వానం పంపారు. కానీ నారాయణ్పూర్జడ్పీటీసీ తప్ప, ఏ ఒక్కరూ రాలేదు.
అటు మును గోడులో దివ్యాంగులకు ఫించన్ పత్రాలు పంపిణీ చేసే కార్యక్రమానికి సైతం ఇద్దరు, ముగ్గురు ఎంపీపీలు మినహా కీలక నేతలు హాజరుకాలేదు. ఎమ్మెల్యేలపై స్థానిక ప్రజాప్రతినిధుల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ ఘటన ఉదాహర ణగా నిలిచింది. ఎమ్మెల్యేల ఏకపక్ష నిర్ణ యాలతో చాలా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ దూర మైంది. బీఆర్ఎస్లో టికెట్ల ప్రకటన తర్వా త నకిరేకల్, ఆలేరు, మునుగోడు, సాగర్, మంచిర్యాల, కోదాడ, మహబూబాబాద్, పెద్దపల్లి, రామగుండం, చొప్పదండి తదితర చోట్ల క్యాడర్బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు.