ప్రజా పాలనలో అగ్రస్థానం సాధిస్తాం : సి.నారాయణ రెడ్డి

  • మొదటి ప్రయార్టీ ధరణి సమస్యలకే
  • ఇక నుంచి మండల స్థాయిలోనే ప్రజావాణి
  • పనిచేసే ఆఫీసర్లను పొగుడ్తాం..తేడా వస్తే యాక్షన్​ తప్పదు
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో  నల్గొండ కలెక్టర్​ సి.నారాయణ రెడ్డి

నల్గొండ, వెలుగు: ప్రజల ముంగిటే ప్రజాపాలన అందిస్తామని, వచ్చే సోమవారం నుంచి జిల్లా పరిపాలనలో పూర్తి మార్పులు కనిపిస్తాయని నల్గొండ కలెక్టర్ ​చెప్పారు. ఈ జిల్లాలో జేసీగా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఆఫీసర్లను కలుపుకొని పనిచేస్తానని వెల్లడించారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
ప్రభుత్వ పథకాలే టాప్​ ప్రయార్టీప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే టాప్​ ప్రయార్టీ.  నిబంధనల మేరకు పథకాలను అమలు చేస్తాం. 

గృహజ్యోతి, రేషన్​ బియ్యం పంపిణీ, పింఛన్లు, జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇందుకోసం జిల్లా ఆఫీసర్లను మండల ఇన్​చార్జిలుగా నియమించాం. వారంలో మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. వారి శాఖలతోపాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనిచేయాలి. పనిచేసే ఆఫీసర్లను ప్రోత్సహి స్తాం. అదే టైంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.

జిల్లా స్థాయిలో ప్రజావాణి రద్దు..

వచ్చే సోమవారం నుంచి మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహిస్తాం. ప్రజలకు చేరువలో ప్రజా పాలన అందిస్తాం. ప్రజావాణిలో ఎండీపీవో నోడల్​అధికారిగా ఉంటారు. తహసీల్దారు, ఎంపీవో, ఏపీఎం, అగ్రికల్చర్​ ఆఫీసర్, ఇతర మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రజావాణిలో పాల్గొనాలి. ప్రజావాణి దరఖాస్తులను జిల్లా స్థాయిలో అప్​లోడ్​ చేయాలి. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి నిర్వహిస్తారు. మండల స్థాయిలో 15 రోజులైనా సమస్యలు పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో పరిష్కరిస్తాం. గ్రామ పంచాయతీ కార్యదర్శులు సేవలు తప్పనిసరిగా వాడుకోవాలి. జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు  చేస్తున్నాం. ఆ రోజున నాతో సహా, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ మండలాల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంపై దృష్టి సారిస్తాం. సీఎంఆర్​పై ప్రతి రోజు రివ్యూ ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బంది హాజరుపై క్రమ పద్ధతి పాటిస్తాం. 

ధరణి సమస్యలపైనే ప్రత్యేక దృష్టి..

ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న ధరణి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.  ప్రత్యేకించి పెండింగ్​అప్లికేషన్స్​ అన్నింటినీ వచ్చే 15 రోజుల్లో క్లియర్​ చేస్తాం. ఇందుకుగానూ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆఫీసర్లు, సిబ్బంది ఒక టీమ్​గా ఏర్పడి పనిచేస్తాం. భూములకు సంబంధించి పొజిషన్​లో ఉన్న రైతులు, టైటిల్ పరిశీలన, ప్రభుత్వ ప్రాధాన్యత, న్యాయపరమైన వివాదాల వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారిస్తాం.  

ఒకవేళ ఏదైనా దరఖాస్తు తిరస్కరించాల్సి వస్తే ఎందుకు రిజక్ట్​ చేశామో కూడా స్పష్టంగా తెలియజేస్తాం. ధరణి రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించాం. ధరణికి సంబంధించి జీఎల్ఎం, వారసత్వ, కోర్టు కేసులు, జీపీఏ, నాలా, మిస్సింగ్ సర్వే నంబర్, టీఎం 33 తదితర అన్ని అంశాలపై రెవెన్యూ అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చాం. సర్వే ఆఫీసర్లు భూముల సర్వే పక్కాగా చేయాలని చెప్పాం. ఎక్కడా తప్పులు చేయొద్దని హెచ్చరించాం. 

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం..

ప్రతి పాఠశాలలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు సౌకర్యాల పైన తనిఖీ చేయాలని డీఈవోను ఆదేశించాం. క్లోరినేషన్​ చేసిన నీటినే విద్యార్థులకు ఇవ్వాలని చెప్పాం. అదేవిధంగా పాఠశాలల్లో విద్యుత్​ షాక్ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతాం. సంక్షేమ హాస్టల్స్​లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. వ్యవసాయం పరంగా రైతులకు యూరియా, ఎరువుల పంపిణీ సక్రమంగా చేస్తాం. ఎక్కడైన నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు.